Lakshadweep: కొత్త చట్టాలపై అమిత్ షా భరోసా ఇచ్చారు: లక్షద్వీప్ ఎంపీ

  • లక్షద్వీప్ లో కొత్త చట్టాలను తీసుకొచ్చేందుకు సిద్ధమైన కేంద్రం
  • తమ వ్యతిరేకతను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లామన్న ఎంపీ మొహమ్మద్
  • స్థానికులతో సంప్రదింపుల తర్వాతే నిర్ణయం తీసుకుంటామని అమిత్ షా చెప్పారని వెల్లడి
Amit Shah assured us on new laws says Lakshadweep MP

లక్షద్వీప్ ప్రజలతో సంప్రదింపులు జరపకుండా, వారి అభిప్రాయాలను స్వీకరించకుండా ఎలాంటి కొత్త చట్టాలను తీసుకురాబోమంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారని లక్షద్వీప్ ఎంపీ మొహమ్మద్ ఫైజల్ తెలిపారు. అమిత్ షాతో భేటీ అయిన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడుతూ.. లక్షద్వీప్ కొత్త అడ్మినిస్ట్రేటర్ ప్రదీప్ పాటిల్ ప్రతిపాదిస్తున్న కొత్త చట్టాలను తమ ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారని అమిత్ షాకు తెలిపానని చెప్పారు. తమ ద్వీప సమూహంలో జరుగుతున్న ప్రజా నిరసనలు, ఆందోళన కార్యక్రమాలను హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లానని అన్నారు.

ప్రస్తుతం ప్రతిపాదనలో ఉన్న కొత్త చట్టాల డ్రాఫ్టును లక్షద్వీప్ కు పంపుతామని... జిల్లా పంచాయతీల స్థాయిలో ప్రజాప్రతినిధులు దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవచ్చని అమిత్ షా చెప్పారని మొహమ్మద్ తెలిపారు. ప్రదీప్ పాటిల్ ను తొలగించాలని కూడా తాను కోరానని చెప్పారు.

ప్రదీప్ పాటిల్ కొత్త చట్టాలను తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని... ఆవులను వధించడంపై బ్యాన్ విధించారని, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేవారికి ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉండకూడదనే కండిషన్ పెట్టారని, రిసార్టుల్లో లిక్కర్ అమ్మకాలను అనుమతించారని అసహనం వ్యక్తం చేశారు. లక్షద్వీప్ లో మెజారిటీ ప్రజలు ముస్లింలు అనే విషయం గమనార్హం.

తమ సమస్యపై చర్చించేందుకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలతో సమావేశమయ్యేందుకు సిద్ధమయ్యారని మహమ్మద్ తెలిపారు. మరోవైపు ఈ కొత్త చట్టాల డ్రాఫ్ట్ ను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో పాటు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా వ్యతిరేకించారు. లక్షద్వీప్ ప్రజలకు అండగా ఉంటామని ప్రకటించారు.

More Telugu News