'మంచి వ్యక్తి' అంటూ చంద్రబాబు... 'మల్లెపువ్వు లాంటి మనసు' అంటూ చిరంజీవి... సూపర్ స్టార్ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు

31-05-2021 Mon 15:08
  • నేడు హీరో కృష్ణ జన్మదినం
  • నటశేఖరుడిపై శుభాకాంక్షల వెల్లువ
  • ట్విట్టర్ లో స్పందిస్తున్న ప్రముఖులు
  • ఆయురారోగ్యాలతో ఉండాలంటూ ఆకాంక్ష
Birthday greetings poured on Superstar Krishna
తెలుగు చిత్రసీమలో మొట్టమొదటి సూపర్ స్టార్ కృష్ణ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఆయనపై జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు, చిరంజీవి, నారా లోకేశ్, విజయశాంతి తదితరులు నటశేఖరుడిపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.

 తెలుగు సినీ పరిశ్రమలో 40 ఏళ్లకు పైగా నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా రాణించి... సూపర్ స్టార్ గా, మంచి వ్యక్తిగా, మాజీ ఎంపీగా ప్రజాదరణ పొందిన ఘట్టమనేని కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ చంద్రబాబు స్పందించారు. భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను, ప్రశాంతతను అందివ్వాలని మనసారా కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు.

ఇక, తన సినీ రంగ సహచరుడికి మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా విషెస్ తెలియజేశారు. సాహసానికి మారుపేరు, మల్లెపువ్వు లాంటి మనిషి సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.

కాగా, కృష్ణతో అనేక హిట్ చిత్రాల్లో కథానాయికగా నటించిన విజయశాంతి కూడా శుభాకాంక్షలు అందజేశారు. కిలాడీ కృష్ణుడు నుంచి ఒసేయ్ రాములమ్మ వరకు తమ కాంబినేషన్ లో హిట్లు, సూపర్ హిట్లు, సెన్సేషనల్ హిట్లు వచ్చాయని వెల్లడించారు. 'మీరంటే ఎప్పటికీ గౌరవం సర్' అంటూ విజయశాంతి వినమ్రంగా స్పందించారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా కృష్ణకు విషెస్ తెలిపారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ తో సరిసమానంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సేవలు అందించిన సూపర్ స్టార్ కృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ఆయురారోగ్యాలతో, ఆనందాలతో మరెన్నో ఘనమైన పుట్టినరోజు వేడుకలు సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు.