COVID19: వ్యాక్సిన్లపై ఫైజర్​ సీఈవోకు పూణె వ్యక్తి లేఖ.. బదులిచ్చిన బౌర్లా!

Pune man writes to Pfizer CEO asking for Covid vaccine in India gets immediate response
  • భారత్ లో వ్యాక్సిన్ ఎప్పుడు తెస్తారని ప్రశ్న
  • జాన్సన్ అండ్ జాన్సన్, మోడర్నాలకూ లేఖ
  • త్వరలోనే తీసుకొస్తామన్న ఫైజర్ సీఈవో
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ను మరింత వేగవంతం చేసేందుకు విదేశీ టీకాలనూ సమీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఫైజర్ టీకాలపైనా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫైజర్ కు పూణేకి చెందిన ప్రకాశ్ మీర్ పురి (58) అనే వ్యక్తి లేఖ రాశాడు. భారత్ కు ఎప్పుడు వ్యాక్సిన్లను సరఫరా చేస్తారంటూ ప్రశ్నించాడు. దానికి ఫైజర్ సీఈవో బదులు కూడా ఇచ్చారు.

ఆ లేఖ ఎందుకు?

  తనతో పాటు తన కుటుంబానికి వ్యాక్సిన్ వేయించేందుకు ఏప్రిల్ 1వ తేదీకి అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకున్నానని ప్రకాశ్ చెప్పాడు. అయితే, దురదృష్టవశాత్తూ మార్చి 18న తనకు కరోనా సోకిందని, ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నానని తెలిపాడు. ఆ సమయంలో ఐసోలేషన్ లో ఉండగా.. అమెరికాలోని తన మిత్రుడు అభయ్ ఫైజర్ వ్యాక్సిన్ చాలా బాగా పనిచేస్తోందంటూ చెప్పాడని తెలిపాడు. అభయ్ తల్లిగారు వైట్ హౌస్ లో ఫిజిషియన్స్ పానెల్ మెంబర్ అయినందువల్ల అతడు చెప్పిన సమాచారం కరెక్ట్ అయి ఉంటుందని భావించానని చెప్పాడు.

ఆసుపత్రి నుంచి ఇంటికెళ్లాక ఫైజర్ తో పాటు జాన్సన్ అండ్ జాన్సన్, మోడర్నా సంస్థల సీఈవోలకూ వ్యాక్సిన్లకు సంబంధించి ఈ–మెయిల్ చేశానన్నాడు. అంతేగాకుండా ఆ మూడు సంస్థల్లో రూ.5 లక్షలు పెట్టి షేర్లు కొన్నానని చెప్పాడు.

ఇదీ ఫైజర్ సీఈవో రిప్లై..

ప్రకాశ్ లేఖకు ఫైజర్ సీఈవో ఆల్బర్ట్ బౌర్లా బదులిచ్చారు. భారత్ లో ఇంకా రెగ్యులేటరీ అనుమతులు రాలేదని, ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. త్వరలోనే భారత్ లోనూ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తామన్నారు. ఫైజర్ వ్యాక్సిన్ పై ఆసక్తి చూపించినందుకు ప్రకాశ్ ను ఆయన అభినందించారు. వీలైనంత తక్కువ ధరకే వ్యాక్సిన్ ను అందిస్తామని చెప్పారు.
COVID19
Pfizer
Albert Bourla

More Telugu News