Uttar Pradesh: పెరోల్ మాకొద్దు బాబోయ్.. మమ్మల్ని జైలులోనే ఉంచండి: ఉత్తరప్రదేశ్ జైళ్లలోని ఖైదీల అభ్యర్థన

  • బయట కరోనా పరిస్థితుల నేపథ్యంలో లేఖ
  • ఖైదీల అభ్యర్థనను తోసిపుచ్చలేమన్న జైళ్ల శాఖ డీజీ ఆనంద్‌కుమార్
  • పెరోల్‌పై ఇప్పటి వరకు 2,200 మంది, మధ్యంతర బెయిలుపై 9,200 మంది విడుదల
21 prisoners in UP dont want parole amid Covid pandemic

తమకు పెరోల్ వద్దని, తమను జైలులోనే ఉండనివ్వాలంటూ ఉత్తరప్రదేశ్‌లోని వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 21 మంది ఖైదీలు ఉన్నతాధికారులకు లేఖ రాశారు. కరోనా కారణంగా బయట పరిస్థితులు ఏమంత బాగోలేవని, కాబట్టి తమను జైలులోనే ఉండనివ్వాలని కోరారు. ఖైదీలు లేఖ రాసిన విషయాన్ని జైళ్ల పరిపాలనశాఖ డైరెక్టర్ జనరల్ ఆనంద్‌కుమార్ మీడియాకు తెలిపారు.

బయట కరోనా వైరస్ తాండవిస్తుండడంతో బయటి కంటే జైలులోనే పరిస్థితులు సురక్షితమని ఆనంద్‌కుమార్ పేర్కొన్నారు. జైలులో అయితే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయిస్తామని, గంట కొట్టగానే అన్నం పెడతామని అన్నారు. ఖైదీలకు ఇచ్చే 90 రోజుల పెరోల్ కాలాన్ని మళ్లీ శిక్షాకాలంలో కలుపుతామని అందుకనే వారు పెరోల్‌కు విముఖత చూపుతున్నారని పేర్కొన్నారు. తమకు పెరోల్ వద్దని వారు లిఖితపూర్వకంగా కోరారు కాబట్టి ఆమోదించక తప్పదన్నారు.

కాగా, జైళ్లలో కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. ఏడేళ్లలోపు శిక్ష అనుభవిస్తున్న వారికి, కేసులు విచారణలో ఉన్న వారికి పెరోల్, లేదంటే మధ్యంతర బెయిలు మంజూరు చేసే విషయాన్ని పరిశీలించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో పెరోల్‌పై 2,200 మందిని, మధ్యంతర బెయిలుపై 9,200 మందిని విడుదల చేసినట్టు డీజీ ఆనంద్‌కుమార్ తెలిపారు.

More Telugu News