Lockdown: తెలంగాణలో మరో 10 రోజుల పాటు లాక్ డౌన్ పొడిగింపు

  • నేడు సమావేశమైన తెలంగాణ క్యాబినెట్
  • కరోనా తదితర అంశాలపై చర్చ
  • లాక్ డౌన్ పొడిగింపుకే మొగ్గు
  • అయితే సడలింపులతో ప్రజలకు ఊరట
  • ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు కార్యకలాపాలు
Lock down extended in Telangana for ten days

సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ క్యాబినెట్ కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో 10 రోజుల పాటు లాక్ డౌన్ పొడిగించాలని నిర్ణయించింది. అయితే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సడలింపు ఇచ్చారు. ఇంటి నుంచి బయటికి వచ్చిన వారు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల లోపు ఇళ్లకు చేరుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎవరైనా బయట కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు.

ఇప్పటివరకు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే కార్యకలాపాలకు అనుమతించిన ప్రభుత్వం... కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో, ప్రజల కార్యకలాపాలకు మరికొన్ని గంటలు అదనపు సమయం ఇవ్వాలని నిర్ణయించింది. ఆపై, మధ్యాహ్నం 1 గంట నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుంది. పరిమితంగా వాణిజ్య కార్యకలాపాలకు క్యాబినెట్ ఆమోదం లభించిందని, దీనికి సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో విడుదల అవుతాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.

దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యాక తెలంగాణలోనూ భారీగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో తొలుత నైట్ కర్ఫ్యూ విధించిన రాష్ట్ర ప్రభుత్వం ఆపై కోర్టు ఒత్తిడితో మే 12 నుంచి లాక్ డౌన్ ప్రకటించింది. తాజాగా కరోనా ఉద్ధృతి నిదానించడంతో కొద్దిమేర ఆంక్షలు సడలించాలని క్యాబినెట్ భేటీలో నిర్ణయించారు.

More Telugu News