Airlines: జూన్ 1 నుంచి పెరగనున్న దేశీయ విమాన ప్రయాణ ఛార్జీలు!

Domestic airlines charges to increase  from June 1
  • లోయర్ లిమిట్ 15 శాతం పెంపు
  • అప్పర్ లిమిట్ లో మార్పు లేదన్న విమానయాన శాఖ
  • కరోనా నష్టాల కారణంగా ఛార్జీలను పెంచుతున్నట్టు ప్రకటన
వచ్చే నెల 1వ తేదీ నుంచి డొమెస్టిక్ విమాన ఛార్జీలు పెరగనున్నాయి. దేశీయ ప్రయాణాలకు సంబంధించి లోయర్ లిమిట్ ను 15 శాతం పెంచుతున్నట్టు నిన్న భారత విమానయాన శాఖ ప్రకటించింది. దేశీయ విమానయాన సంస్థలు నష్టాల బాటలో పయనిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

కరోనా నేపథ్యంలో, ప్రయాణికులు విమానాల్లో ప్రయాణించడం తగ్గిందని.. దీని వల్ల విమానయాన సంస్థలకు నష్టాలు వస్తున్నాయని చెప్పింది. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ పరిస్థితిని మరింత దిగజార్చిందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఛార్జీలను పెంచాల్సి వచ్చిందని వెల్లడించింది. ఎయిర్ లైన్స్ సంస్థలను కష్టాల నుంచి గట్టెక్కించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది.

40 నిమిషాల కంటే తక్కువ ప్రయాణ సమయం ఉండే ప్రయాణాల ఛార్జీలను 13 శాతం అంటే... రూ. 2.300 నుంచి రూ. 2.600కి పెంచుతున్నట్టు విమానయాన శాఖ తెలిపింది. అయితే, ఈ ప్రయాణాలకు గరిష్ఠ ధర మాత్రం రూ. 7,800లకు మించకూడదని చెప్పింది.

40 నిమిషాల నుంచి 60 నిమిషాల ప్రయాణాల ఛార్జీని రూ. 2,900 నుంచి రూ. 3,300కు పెంచినట్టు తెలిపింది. గరిష్ఠ ఛార్జీ రూ. 9,800కు మించకూడదని చెప్పింది. ఇదే సమయంలో అప్పర్ లిమిట్ ఛార్జీలలో మాత్రం ఎలాంటి మార్పులు లేవని ప్రకటించింది.
Airlines
Domestic
Fairs
Hike

More Telugu News