టీకా వేయించుకుంటే రూ.840 కోట్లు మీవే కావొచ్చు: ప్రైజ్ మనీ ప్రకటించిన కాలిఫోర్నియా

29-05-2021 Sat 09:16
  • వ్యాక్సినేషన్ దిశగా యువతను ప్రోత్సహించేందుకు ప్లాన్
  • జూన్ 4న ప్రారంభం కానున్న లక్కీ డ్రా
  • లక్కీ డ్రాలో 10 మందికి రూ. 10.86 కోట్లు
Get vaccinated win cash as California offers 116 dollars million in prizes

టీకా తీసుకునేందుకు యువత విముఖత ప్రదర్శిస్తుండడంతో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం అద్భుతమైన ప్లాన్ వేసింది. వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించేందుకు భారీ బహుమతి ప్రకటించింది. టీకా వేయించుకోవడం ద్వారా 116 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ. 840 కోట్లు) ప్రైజ్ మనీని ప్రకటించింది.

వచ్చే నెల 15 నుంచి కరోనా ఆంక్షలు ఎత్తివేయాలని, మునుపటి పరిస్థితి తీసుకురావాలని సంకల్పించిన ప్రభుత్వం ఇందుకోసం వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయాలని నిర్ణయించింది. అయితే, యువత పెద్దగా ముందుకు రాకపోవడంతో సరికొత్త వ్యూహాన్ని రూపొందించింది.

నిజానికి ఇక్కడ 12 ఏళ్లు పైబడిన అందరికీ వ్యాక్సిన్ ఇస్తున్నారు. అయితే, టీకా వేయించుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో ఇప్పటి వరకు 63 శాతం జనాభాకు మాత్రమే టీకాలు ఇచ్చారు. మిగిలిన వారిని కూడా వ్యాక్సిన్ దిశగా ప్రోత్సహించేందుకు లక్కీ డ్రా ప్రకటించింది.

తొలి డోసు తీసుకున్న వారు ఈ లక్కీ డ్రాకు అర్హులని గవర్నర్ గవిన్ న్యూసమ్ తెలిపారు. వచ్చే నెల 4 నుంచి లక్కీ డ్రా ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా 10 మందికి 1.5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 10.86 కోట్లు), 30 మందికి రూ. 50 వేల డాలర్లు (రూ. 36.21 లక్షలు) ఇవ్వనున్నారు. అలాగే, 20 లక్షల మందికి 50 డాలర్లు (రూ.3,600) విలువైన గిఫ్ట్ కూపన్లు ఇవ్వనున్నారు. ఇలాంటి ఆఫర్‌నే ఇప్పటికే  ఒహాయో, కొలరాడో, ఒరేగాన్ రాష్ట్రాలు ప్రకటించాయి.