Pfizer: వీలైనంత త్వరగా భారత్ లో ఫైజర్ వ్యాక్సిన్లు: నీతి ఆయోగ్

  • దేశంలో వ్యాక్సిన్ డోసులకు కొరత
  • విదేశీ వ్యాక్సిన్ల వైపు కేంద్రం చూపు
  • ఫైజర్ తో చర్చలు జరుపుతున్నట్టు వీకే పాల్ వెల్లడి
  • వ్యాక్సిన్ల దేశీయ ఉత్పత్తికి కేంద్రం సహకారం
Pfizer vaccines soon in India as per Niti Aayog

దేశ జనాభాతో పోల్చితే భారత్ లో అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్ల సంఖ్య చాలా తక్కువ. ప్రస్తుతం కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేస్తుండగా, డిమాండ్ కు తగ్గట్టుగా వీటి సరఫరా లేకపోవడంతో చాలా ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ ఆశించినంత వేగంగా జరగడంలేదు. ఈ నేపథ్యంలో కేంద్రం విదేశీ వ్యాక్సిన్లపై దృష్టి సారించింది.

దీనిపై నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ స్పందిస్తూ... ఫైజర్ టీకాను వీలైనంత త్వరగా దిగుమతి చేసుకుంటామని తెలిపారు. దీనిపై ఫైజర్ ఫార్మా సంస్థ యాజమాన్యంతో కేంద్రం చర్చిస్తోందని వెల్లడించారు. ఫైజర్ మాత్రమే కాకుండా మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థలతోనూ కేంద్రం సంప్రదింపులు జరుపుతోందని అన్నారు. ఆయా వ్యాక్సిన్లను దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని వీకే పాల్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ల సరఫరా పరిమితంగానే ఉందని అభిప్రాయపడ్డారు. దేశాలకు వ్యాక్సిన్ డోసుల కేటాయింపులపై ఆయా కంపెనీలకు సొంత ప్రాధాన్యతలు ఉంటాయని తెలిపారు.

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ పై అనేక అపోహలు వస్తున్నాయని అన్నారు. తప్పుడు ప్రకటనలు, అర్ధ సత్యాలు, అసత్య ప్రచారాలకు కారణమవుతున్నాయని వీకే పాల్ వ్యాఖ్యానించారు. కేంద్రం పారదర్శక పద్ధతిలోనే రాష్ట్రాలకు వ్యాక్సిన్ డోసులు కేటాయిస్తోందని చెప్పారు.

More Telugu News