Vijayashanti: తెలంగాణ పాలకుల తీరే ఈ ఘోరానికి మూలమని మీడియా కథనం రుజువుచేసింది: విజయశాంతి

  • ఇటీవల తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు
  • ఎన్నికల సిబ్బందిలో పలువురు కరోనాతో మృతి
  • మీడియాలో ప్రచురితమైన కథనం
  • ప్రభుత్వమే బాధ్యత వహించాలన్న విజయశాంతి
  • పరిహారం చెల్లించాలని డిమాండ్
Vijayashanthi slams state govt after some polling staff died of corona

ఇటీవల తెలంగాణలో మినీ మున్సిపోల్స్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో విధులు నిర్వర్తించిన పలువురు సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, దానిపై మీడియాలో తీవ్రస్థాయిలో ఓ కథనం వచ్చింది. ప్రాణాలు తీసిన పోలింగ్... సిబ్బందికి ప్రాణాంతకమైన పురపాలక ఎన్నికల విధులు అంటూ ప్రచురితమైన ఆ కథనంపై బీజేపీ నేత విజయశాంతి స్పందించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ లో అణువణువు నిండిన అహంకారం ఫలితం ఏమిటో నేటి మీడియా కథనం చూస్తే అర్థమవుతుందని విమర్శించారు.

విపక్షాలు, ఉపాధ్యాయ సంఘాలు ఎంత చెప్పినా, ఎంత ఆందోళన వ్యక్తం చేసినా ప్రభుత్వం వినకుండా, మొండిపట్టుదలకు పోయి ఎన్నికలు నిర్వహించిందని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం నిర్వహించిన ఎన్నికల కారణంగా పలువురు టీచర్లు, మున్సిపల్ సిబ్బంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారని విజయశాంతి ఆరోపించారు. వైద్య ఖర్చులు భరించలేక వారి కుటుంబాలు అప్పులపాలై నడిరోడ్డున పడ్డాయని, వారి పిల్లలు అనాథలయ్యారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారం తప్ప మరేదీ పట్టని తెలంగాణ పాలకుల తీరే ఈ ఘోరానికి మూలమని ఆధారాలతో సహా ఆ మీడియా కథనం రుజువు చేసిందని తెలిపారు. సాధారణ పరిస్థితుల్లో ఎన్నికలు జరిపితే తమకు వ్యతిరేక ఫలితం వస్తుందని భావించిన అధికారపక్షం... కరోనా ముప్పున్న సమయంలో ఎన్నికలు నిర్వహించుకుని అధికారాన్ని చేజిక్కించుకోవచ్చన్న దురుద్దేశంతోనే ఈ చర్యకు పాల్పడినట్టు స్పష్టమవుతోందని ఆరోపించారు.

ఈ తప్పుడు నిర్ణయాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని విజయశాంతి స్పష్టం చేశారు. ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ మేరకు పరిహారం చెల్లించి కొంతైనా పాప ప్రక్షాళన చేసుకోవాలని సూచించారు.

More Telugu News