Singapore: కొవిడ్ సోకిందీ, లేనిదీ ఒక్క నిమిషంలో చెప్పేస్తుంది.. సింగపూర్ పరిశోధకుల ఆవిష్కరణ

Singapore Approves Corona Virus Breath Test With One Minute Result
  • కొత్త సాధనానికి సింగపూర్ ప్రభుత్వం అనుమతి
  • ‘బ్రెఫెన్స్ గో కొవిడ్-19 టెస్ట్’ అనే పేరు
  • బ్రీత్ అనలైజర్‌ను పోలి ఉండే పరికరం
  • అభివృద్ధి బృందంలో భారతీయుడు
కరోనా వైరస్ సోకిందీ, లేనిదీ ఒక్క నిమిషంలో చెప్పేసే సాధనాన్ని సింగపూర్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. వ్యక్తి శ్వాసను విశ్లేషించడం ద్వారా ఇది కరోనా ఆనవాళ్లను పసిగడుతుంది. ఈ సరికొత్త సాధనానికి సింగపూర్ ప్రభుత్వం నిన్న తాత్కాలిక అనుమతి మంజూరు చేసింది.

నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌కు అనుబంధంగా ఏర్పడిన ‘బ్రీతోనిక్స్’ అనే స్టార్టప్ ఈ సాధనాన్ని రూపొందించింది. ఈ బృందంలో భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ టి. వెంకీ వెంకటేశన్ కూడా ఉన్నారు. ఈ సాధనానికి ‘బ్రెఫెన్స్ గో కొవిడ్-19 టెస్ట్’ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ పరికరాన్ని ఓ చెక్‌పోస్టు వద్ద ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నారు.

కరోనా పరీక్షల కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాధనాల ద్వారా పరీక్ష ఫలితం రావడానికి కనీసం అరగంట సమయం పడుతోంది. ఈ సరికొత్త పరికరం ద్వారా నిమిషంలోనే ఫలితాన్ని తెలుసుకోవచ్చు. అంతేకాదు, నమూనాలు సేకరించి వాటిని ల్యాబ్‌కు తరలించడం వంటి శ్రమ కూడా తగ్గుతుంది. పరీక్ష కోసం ముక్కు, గొంతులోకి ఎలాంటి సాధనాలను పంపాల్సిన అవసరం లేదు. వాహనాలు నడిపేవారు మద్యం తాగిందీ, లేనిదీ తెలుసుకునేందుకు ట్రాఫిక్ పోలీసులు ఉపయోగించే బ్రీత్ అనలైజర్‌ను ఇది పోలి ఉంటుంది.
Singapore
COVID19
Breath Test

More Telugu News