Vijayashanti: హెలికాప్టర్ లో వెళుతున్నప్పుడే రైతుల కష్టాలు కనిపించాయా?: విజయశాంతి

  • రైతు గోస-బీజేపీ పోరు దీక్షలో పాల్గొన్న విజయశాంతి
  • ధాన్యం తడిసి రైతులు నష్టపోయారని వెల్లడి
  • ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్
  • రుణమాఫీ, రైతు బంధు అమలు చేయాలని స్పష్టీకరణ
Vijayashanthi question CM KCR over farmers problems

బీజేపీ నేత విజయశాంతి తెలంగాణ రైతు గోస-బీజేపీ పోరు దీక్షలో పాల్గొన్న సందర్భంగా మీడియాతో మాట్లాడారు. వర్షాలకు ధాన్యం తడిసిపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. గత 20 రోజులుగా రైతులు అకాల వర్షాల వల్ల తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని, ధాన్యం తడిసి తీవ్రంగా నష్టపోయారని వివరించారు. చేతికందిన పంట నాశనం అయిందని, ధాన్యం మొలకలొచ్చిందని పేర్కొన్నారు.

"తమ కష్టాలు తీర్చండని రైతులు ఘోష పెడుతుంటే, తమరు హెలికాప్టర్ లో వెళుతున్నప్పుడే రైతుల కష్టం కనిపించిందా? గత 20 రోజుల నుంచి మీకు కనిపించలేదా?" అంటూ సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. "మీ అధికారులు, మీ కలెక్టర్లు ఈ విషయాన్ని మీకు నివేదించలేదా? ఏ జిల్లాలో ఏం జరుగుతోందో చెప్పేవాళ్లే కరవయ్యారా? ఇవేవీ తెలియనప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఎందుకు కొనసాగుతున్నారు? ఒక్క గింజ కూడా పోకుండా రైతుల నుంచి మొత్తం ధాన్యం కొనేయాలన్నారు... ఇప్పటివరకు ఏం కొన్నారు?" అని విజయశాంతి ప్రశ్నించారు.

పాత వాగ్దానాలే ఇప్పటివరకు తీరలేదని, తాజా వాగ్దానాలే గురించి చెప్పేదేముందని వ్యాఖ్యానించారు. కరోనా సంక్షోభ సమయంలో అయితే తనను ఎవరూ వాగ్దానాల గురించి ప్రశ్నించరన్న ఉద్దేశంతోనే కేసీఆర్ ఆసుపత్రుల పర్యటనలు చేస్తున్నాడని విమర్శించారు. ఈ సమయంలో రైతులను కేసీఆర్ ఆదుకోవాలని, వారికి రుణమాఫీ, రైతు బంధు అమలు చేయాలని విజయశాంతి డిమాండ్ చేశారు.

More Telugu News