Kakani Govardhan Reddy: ఆనందయ్యకు గట్టి భద్రతను కల్పించాలని కోరిన ఎమ్మెల్యే కాకాణి
- ఆనందయ్య మందుపై ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారు
- ఆయుష్ నివేదికను ప్రభుత్వం ఆధారంగా తీసుకునే అవకాశం ఉంది
- ఆనందయ్యకు భద్రతాపరమైన ఇబ్బందులు లేవు
కరోనాకు ఆయుర్వేద మందును ఇస్తున్న ఆనందయ్య భద్రతపై సర్వేపల్లి వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కృష్ణపట్నం పోర్టులో నిర్వహించిన ఈ సమీక్షా సమావేశానికి అడిషనల్ ఎస్పీ వెంకటరత్నంతో పాటు పలువురు పోలీసు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆనందయ్యకు గట్టి భద్రతను కల్పించాల్సిందిగా ఎమ్మెల్యే కోరారు.
సమీక్ష అనంతరం మీడియాతో కాకాణి మాట్లాడుతూ, ఆయుర్వేద మందును పరీక్షించేందుకు ఐసీఎంఆర్ అధికారులు రావాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆయుష్ సమర్పించిన నివేదికనే రాష్ట్ర ప్రభుత్వం ఆధారంగా తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఆయుర్వేద మందుపై ముఖ్యమంత్రి జగన్ సానుకూలంగా ఉన్నారని... ప్రభుత్వం అనుకూలంగా స్పందించే అవకాశం ఉందని అన్నారు. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే.. త్వరలోనే ఆనందయ్య మందులను ప్రజలకు పంపిణీ చేస్తామని చెప్పారు.
ఆనందయ్యకు భద్రతాపరమైన ఎలాంటి ఇబ్బందులు లేవని... ఆయనకు పోలీసులు రక్షణ కల్పించారని కాకాణి తెలిపారు. ఆనందయ్య మందు కోసం ప్రజలెవరూ రావద్దని... ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన తర్వాత పోస్టులో మందులను పంపిస్తామని చెప్పారు.