Harish Rao: ఈటలకు చెక్.. హుజూరాబాద్ రంగంలోకి అడుగుపెట్టిన హరీశ్ రావు

Harish Rao meets Huzurabad TRS leaders
  • టీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా పేరుగాంచిన హరీశ్
  • కేసీఆర్ సూచనలతో రంగంలోకి దిగిన హరీశ్
  • హుజూరాబాద్ నియోజకవర్గ నేతలతో భేటీ
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి స్థాయిలో టార్గెట్ చేశారు. ఇప్పటికే ఈటలను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన కేసీఆర్... ఆయన రాజకీయ పునాదులను కూడా కదిలించేందుకు శరవేగంగా అడుగులు వేస్తున్నారు. నిన్నటి వరకు ఈటలను టర్గెట్ చేసే పనిని మంత్రి గంగుల కమలాకర్ కు అప్పగించారు. అయితే, ఆశించిన మేరకు గంగుల తన బాధ్యతలను నిర్వహించలేకపోయారు. గంగులను టార్గెట్ చేస్తూ ఈటల తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించడంతో... కేసీఆర్ వ్యూహం మార్చారు.

తన మేనల్లుడు, టీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరుగాంచిన హరీశ్ రావును హుజూరాబాద్ లో రంగంలోకి దించారు. కేసీఆర్ సూచనలతో హరీశ్ రంగంలోకి దిగారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. సంక్లిష్టమైన పరిస్థితుల్లో కూడా పలువురు టీఆర్ఎస్ నేతలను గెలిపించిన సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డ్ హరీశ్ కు ఉంది.

మరోవైపు, హరీశ్ కు, ఈటలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే... హరీశ్ వర్గ నేతగా ఈటలకు గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో, ఈటలను దెబ్బతీసేందుకు హరీశ్ ను రంగంలోకి దించడం ఆసక్తికరంగా మారింది. రాబోయే రోజుల్లో హుజూరాబాద్ రాజకీయ ముఖచిత్రం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి.
Harish Rao
Etela Rajender
TRS
KCR

More Telugu News