Jagan: ప్రైవేటు ఆసుపత్రులకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం తప్పుడు సంకేతాలిస్తోంది: ప్రధానికి మరోసారి లేఖ రాసిన సీఎం జగన్

CM Jagan once again wrote PM Modi for corona vaccine
  • ఏపీలో వ్యాక్సిన్ కొరత ఉందన్న జగన్
  • 45 ఏళ్లకు పైబడిన వారికే ఇస్తున్నామని వెల్లడి
  • ప్రైవేటు ఆసుపత్రులకు వ్యాక్సిన్ ఇవ్వడం సరికాదన్న సీఎం  
  • ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోందని వివరణ
దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి మరోసారి లేఖ రాశారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలన్నది తమ ప్రభుత్వ నిర్ణయమని, వ్యాక్సిన్ కొరత వల్ల ప్రస్తుతం 45 ఏళ్లకు పైబడిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. 18 నుంచి 44 ఏళ్ల లోపు వారికి వ్యాక్సినేషన్ ప్రారంభించలేకపోయామని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రులకు నేరుగా వ్యాక్సిన్ ఇవ్వడం సరికాదని, ఈ చర్య తప్పుడు సంకేతాలు ఇస్తోందని సీఎం జగన్ తన లేఖలో అభిప్రాయపడ్డారు.

కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా వ్యాక్సిన్ ధర నిర్ణయిస్తున్నాయని, ఒక్కో వ్యాక్సిన్ డోసును రూ.2 వేల నుంచి రూ.25 వేల వరకు విక్రయిస్తున్నాయని ప్రధానికి తెలిపారు. వ్యాక్సిన్ పై ప్రభుత్వ నియంత్రణ లేకపోతే బ్లాక్ మార్కెటింగ్ చేస్తారని ఆందోళన వెలిబుచ్చారు. దీనివల్ల సామాన్య ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని వివరించారు.

ఒకవైపు కొరత అంటున్నారు... మరోవైపు ప్రైవేటు ఆసుపత్రులకు ఎలా ఇస్తారు? అని ఆక్రోశించారు. వ్యాక్సిన్ అనేది ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వాల్సిన అంశం అని సీఎం జగన్ స్పష్టం చేశారు. వ్యాక్సిన్లన్నీ కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్దే ఉండాలని సూచించారు.
Jagan
Narendra Modi
Letter
Corona Vaccine
Andhra Pradesh

More Telugu News