Anandaiah Corona Medicine: ఆనందయ్య కరోనా ఔషధం వాడిన వారంతా సంతృప్తిగా ఉన్నారు: సింఘాల్

  • దుష్ఫలితాలు లేవని ఆరోగ్యశాఖ కార్యదర్శి వెల్లడి
  • సోమవారం నుంచి మందుపై శాస్త్రీయ అధ్యయనం
  • మందు వల్లే కరోనా తగ్గిందా అనే అంశంపై అధ్యయనం
  • నెల్లూరు జిల్లా వచ్చిన ఐసీఎంఆర్ బృందం
Singhal says no side effects in Anandaiah coorna medicine

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వాసి ఆనందయ్య అందిస్తున్న కరోనా ఔషధం వాడిన వారంతా సంతృప్తిగా ఉన్నారని ఏపీ ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఔషధంలోని మూలికలు, పదార్థాలతో దుష్ఫలితాలు కనిపించలేదని తెలిపారు.

ఆనందయ్య కరోనా ఔషధాన్ని పరిశీలించేందుకు ఐసీఎంఆర్ బృందం నెల్లూరు జిల్లా వచ్చిన నేపథ్యంలో సింఘాల్ స్పందించారు. ఆనందయ్య కరోనా మందుపై శాస్త్రీయ అధ్యయనం చేపడుతున్నట్టు తెలిపారు. ఆనందయ్య ఔషధం వల్లే కరోనా తగ్గిందా? లేక, వైరస్ తీవ్రత నిదానించడం వల్లే కరోనా తగ్గిందా? అనే దానిపై అధ్యయనం ఉంటుందని వివరించారు.  

సోమవారం నుంచి ఆయుర్వేద మందుపై శాస్త్రీయ పరిశీలన జరుగుతుందని చెప్పారు. కృష్ణపట్నంలోని కరోనా కేసుల సరళి పరిశీలించాలని అధికారులకు సూచించామని అన్నారు. కృష్ణపట్నంలో ఆయుష్ విభాగం అధికారులు పరిశీలించారని, మందు తయారీ విధానం, వాడినవారి అభిప్రాయాలు తెలుసుకున్నట్టు సింఘాల్ వెల్లడించారు. ఈ విషయమై కేంద్ర ఆయుష్ విభాగం ఉన్నతాధికారులతోనూ చర్చించామని పేర్కొన్నారు.

More Telugu News