టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ తండ్రి క్యాన్సర్ తో కన్నుమూత

20-05-2021 Thu 20:22
  • భువనేశ్వర్ కుమార్ కుటుంబంలో విషాదం
  • నేడు తుదిశ్వాస విడిచిన కిరణ్ పాల్ సింగ్
  • ఏడాదిగా క్యాన్సర్ తో బాధపడుతున్న వైనం
  • చికిత్స పొందుతూ మృతి
Team India cricketer Bhuvneshwar Kumar loses his father
టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. భువనేశ్వర్ కుమార్ తండ్రి కిరణ్ పాల్ సింగ్ క్యాన్సర్ తో కన్నుమూశారు. ఆయన వయసు 63 సంవత్సరాలు. మీరట్ లోని తన నివాసంలో ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయన లివర్ క్యాన్సర్ చికిత్సలో భాగంగా కీమోథెరపీ అందుకుంటున్నారు. రెండు వారాలుగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. కిరణ్ పాల్ సింగ్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో పోలీసుగా పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.

గతేడాది సెప్టెంబరులో ఆయన కాలేయ క్యాన్సర్ తో బాధపడుతున్నట్టు గుర్తించారు. బ్రిటన్ లో వైద్య నిపుణులను సంప్రదించిన అనంతరం, ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. కిరణ్ పాల్ సింగ్ కు భార్య ఇంద్రేష్ దేవి, కుమారుడు భువనేశ్వర్, కుమార్తె రేఖ ఉన్నారు.

కాగా, భువనేశ్వర్ కుమార్ ప్రస్తుతం ఇంటి వద్దే ఉన్నాడు. భువీని ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ కు ఎంపిక చేయని సంగతి తెలిసిందే. కాగా, తండ్రిని కోల్పోయిన భువీకి టీమిండియా సహచరులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.