Tirupati: రుయా ఆసుపత్రిలో మరణాలపై.. ఏపీ, కేంద్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు

AP HC gives notices to ap and Union govts
  • తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక పలువురి మృతి
  • 36 మంది చనిపోతే.. 11 మంది మాత్రమే చనిపోయారని ప్రకటించారని పిటిషన్
  • ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని పేర్కొన్న పిటిషనర్ 
తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది కరోనా పేషెంట్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ దారుణ ఘటన చోటుచేసుకుందని విపక్ష నేతలు విమర్శించారు. మరోవైపు ఇదే అంశంపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ ఘటనలో మొత్తం 36 మంది ప్రాణాలు కోల్పోతే... రాష్ట్ర ప్రభుత్వం కేవలం 11 మంది మాత్రమే చనిపోయారని చెపుతోందని టీడీపీ నేత పీఆర్ మోహన్ పిటిషన్ వేశారు. మోహన్ తరపున కోర్టులో న్యాయవాది యలమంజుల బాలాజీ వాదించారు.

ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కోర్టులో వారు వాదించారు. పోలీసులు కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని పేర్కొన్నారు. దీనికి బాధ్యులైన ప్రతి ఒక్కరిపై కేసు నమోదు చేయాలని ధర్మాసనాన్ని కోరారు. ఈ అంశంపై న్యాయ విచారణకు ఆదేశించాలని విన్నవించారు.

కేవలం ఆక్సిజన్ అందకే అంతమంది చనిపోయారని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఐదు ఆక్సిజన్ ప్లాంట్లను ఇచ్చిందని... అయినా, రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు వాటిని నెలకొల్పలేదని ఆయన తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు వేసవి సెలవుల తర్వాత తొలి రోజుకు తదుపరి విచారణను వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.
Tirupati
RUIA Hospital
AP High Court

More Telugu News