బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న కేసులో చోటా రాజన్ మేనకోడలి అరెస్ట్

19-05-2021 Wed 07:09
  • పూణెలోని వన్రోవీ ప్రాంతంలో అరెస్ట్
  • బిల్డర్ ను బెదిరించి రూ. 25 లక్షలు వసూలు   
  • కోర్టులో ప్రవేశపెట్టి రిమాండుకు తరలింపు  
Chhota Rajans niece arrested in extortion case
బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న కేసులో అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ మేనకోడలు ప్రియదర్శిని ప్రకాశ్ నికల్జే (36)ను పూణె పోలీసులు నిన్న  అరెస్ట్ చేశారు. నగరంలోని వనోవ్రీ ప్రాంతంలో ఆమెను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసిన వెంటనే ఆమెను కోర్టులో ప్రవేశపెట్టి రిమాండుకు తరలించినట్టు  డీసీపీ (క్రైమ్) శ్రీనివాస్ ఘడగే తెలిపారు.

స్థానిక బిల్డర్ రాజేశ్ జవ్‌లేకర్‌ను బెదిరించి మార్చి 14న రూ. 25 లక్షలు తీసుకుంటూ ధీరజ్ సబ్లే అనే వ్యక్తి పట్టుబడ్డాడు. ఈ ఘటనలో  సబ్లే, నికల్జేలపై కేసు నమోదైంది. ఆ తర్వాత కూడా ప్రియదర్శిని బెదిరింపులు ఆపలేదు. మరో రూ. 50 లక్షలు ఇవ్వకుంటే ప్రాణాలు తీస్తానని జవ్‌లేకర్‌ను బెదిరించినట్టు పోలీసులు తెలిపారు. చోటా రాజన్ పేరుచెప్పి ప్రియదర్శిని డబ్బులు వసూలు చేస్తుండడంతో ఆమెను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

కాగా, 2015లో పోలీసులకు చిక్కిన చోటా రాజన్ ప్రస్తుతం యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. 61 ఏళ్ల రాజన్ ఇటీవలే కొవిడ్ బారినపడి ఎయిమ్స్‌లో చికిత్స పొందాడు.