టీమిండియా క్రికెటర్లకు ఇంగ్లండ్ లో రెండో డోసు టీకాలు

18-05-2021 Tue 17:07
  • భారత్ లో కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న క్రికెటర్లు
  • త్వరలో ఇంగ్లండ్ పయనం
  • కివీస్ తో వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్
  • రెండో డోసు ఇచ్చేందుకు యూకే ఆరోగ్యశాఖ సమ్మతి
Team India crickters will get their corona vaccine second dose in England

టీమిండియా క్రికెటర్లకు ఇటీవల కరోనా వ్యాక్సిన్ తొలి డోసు అందించారు. అయితే, రెండో డోసుకు మరికొంత సమయం ఉండడంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. న్యూజిలాండ్ తో వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్ వెళుతుండడంతో, ఆటగాళ్లకు ఇంగ్లండ్ లోనే రెండో డోసు టీకా ఇప్పించనుంది. ఈ మేరకు యూకే ఆరోగ్యశాఖ కూడా సమ్మతించింది. దాంతో టీమిండియా ఆటగాళ్లు ఇంగ్లండ్ లో కరోనా టీకా రెండో డోసు పొందేందుకు మార్గం సుగమం అయింది.

ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ జూన్ 18 నుంచి భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య సౌతాంప్టన్ వేదికగా జరగనుంది. క్వారంటైన్, సన్నాహాల నిమిత్తం రెండు జట్లు ముందుగానే ఇంగ్లండ్ చేరుకోనున్నాయి.

అటు, భారత మహిళల క్రికెట్ జట్టు కూడా ఇంగ్లండ్ లో పర్యటించనున్న నేపథ్యంలో, స్టార్ క్రీడాకారిణి హర్మన్ ప్రీత్ కౌర్ మహిళల, పురుషుల జట్లకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఇంగ్లండ్ వెళ్లే ముందు దేశంలో ఎక్కడెక్కడో ఉండే ఆటగాళ్లందరినీ చార్టర్డ్ విమానాల ద్వారా ముంబయి తరలించాలని సూచించారు. ముంబయికి దగ్గరగా ఉండే ఆటగాళ్లు సొంత ఏర్పాట్లతో రావొచ్చని పేర్కొన్నారు.