AP High Court: కరోనా పరిస్థితులపై ఏపీ హైకోర్టులో విచారణ ఈ నెల 19కి వాయిదా

  • కరోనా పరిస్థితులపై హైకోర్టులో పిటిషన్లు
  • కోర్టును ఆశ్రయించిన న్యాయవాదుల సంఘం, ఏపీసీఎల్ఏ, తోట సురేశ్
  • విచారణ చేపట్టిన ద్విసభ్య ధర్మాసనం
  • అఫిడవిట్ దాఖలు చేయాలంటూ కోర్టు ఆదేశం
AP High Court adjourned hearing on corona situations

కరోనా కట్టడి, సహాయక చర్యలపై వివరణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో నేడు విచారణ జరిపారు. అఖిల భారత న్యాయవాదుల సంఘం, ఏపీసీఎల్ఏ, తోట సురేశ్ దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ కన్నెగంటి లలితకుమారి బెంచ్ విచారణకు స్వీకరించింది. ఆక్సిజన్ సరఫరాపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుందని ప్రశ్నించింది. అదే సమయంలో ఆక్సిజన్ బెడ్ల అంశంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ఏంటని అడిగింది. అందరికీ వ్యాక్సినేషన్ కార్యాచరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యల వివరాలు తెలుసుకుంది. రెమ్ డెసివిర్ తో పాటు, ఇతర అత్యవసర ఔషధాల లభ్యతపైనా కోర్టు ఆరాతీసింది.

సీనియర్ సిటిజన్లు, కొవిడ్ రోగులకు ఇళ్ల వద్దే వ్యాక్సిన్ ఇస్తామన్న కార్యాచరణ ఏమైందని న్యాయస్థానం ప్రశ్నించింది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకున్నాయో ఈ నెల 19న తెలపాలని ఆదేశించింది. ఆసుపత్రుల్లో బెడ్లు, కరోనా చికిత్స వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల రోజువారీ సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు అందించాలని స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.

More Telugu News