జీఎస్కే, సనోఫీ టీకా పనితీరు భేష్​.. ఫేజ్​ 2 ట్రయల్స్​ లో మంచి ఫలితాలొచ్చాయన్న సంస్థలు

17-05-2021 Mon 14:43
  • కరోనా యాంటీ బాడీలు వృద్ధి చెందాయని వెల్లడి
  • త్వరలోనే మూడో దశ ట్రయల్స్ మొదలుపెడతామని ప్రకటన
  • సాధారణ ఉష్ణోగ్రతల్లో నిల్వ చేసే టీకాల అవసరం వుందన్న సనోఫీ  
Sanofi GSK Say Covid Vaccine Shows Positive Result

కరోనా మహమ్మారి అంతంలో భాగంగా మరో వ్యాక్సిన్ ఆశలు రేకెత్తిస్తోంది. ఫ్రాన్స్ సంస్థ సనోఫి, బ్రిటన్ దిగ్గజ సంస్థ గ్లాక్సో స్మిత్ క్లైన్ (జీఎస్కే) అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ మంచి ఫలితాలనిస్తోంది. ఈ మేరకు ఈరోజు సంస్థలు టీకా పనితీరుపై ప్రకటన జారీ చేశాయి. గత ఏడాది కొన్ని అనివార్య కారణాలతో వారి వ్యాక్సిన్ పరిశోధనకు బ్రేకులు పడగా.. మళ్లీ వెంటనే తేరుకుని రెండో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాయి.

ఆ ట్రయల్స్ లో కరోనాను నిరోధించే ప్రతిరక్షకాలు (యాంటీ బాడీలు) భారీగా ఉత్పత్తయ్యాయని కంపెనీలు ప్రకటించాయి. 722 మందిపై ట్రయల్స్ చేశామని, పెద్ద వారిలో మంచి ఫలితాలు కనిపించాయని చెప్పాయి. ఈ ఫలితాలిచ్చిన ఉత్సాహంతో రాబోయే వారాల్లో భారీ మూడో దశ ట్రయల్స్ కు సన్నాహాలు చేసుకుంటున్నామని వివరించాయి.
 
కరోనాపై వ్యాక్సిన్ బాగా పనిచేస్తున్నట్టు ఫేజ్ 2 డేటాలో తేలిందని, మహమ్మారితో పోరులో తమ వ్యాక్సిన్ కూడా కీలక పాత్ర పోషిస్తుందని సనోఫీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ థామస్ ట్రయంఫీ చెప్పారు. వేరియంట్లు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రపంచానికి మరిన్ని వ్యాక్సిన్లు అవసరమని చెప్పారు. సాధారణ ఉష్ణోగ్రతల్లో నిల్వ చేసుకునే వ్యాక్సిన్లను తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు.