Alla Nani: బ్లాక్ ఫంగస్ ను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు: మంత్రి ఆళ్ల నాని

Alla Nani said Black Fungus enlisted in Arogyasri treatments list
  • కరోనా రోగులకు ముప్పు కలిగిస్తున్న బ్లాక్ ఫంగస్
  • ప్రాణాలు కూడా పోయే ప్రమాదం
  • బ్లాక్ ఫంగస్ బాధితులకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స
  • రాష్ట్రంలో ఫీవర్ సర్వే చేస్తున్నట్టు తెలిపిన ఆళ్ల నాని
ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై స్పందించారు. కరోనా రోగుల పాలిట పెనుముప్పుగా పరిణమించిన బ్లాక్ ఫంగస్ సమస్యను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువస్తున్నామని వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ కారణంగా కరోనా రోగులు కంటిచూపు పోగొట్టుకోవడమే కాకుండా, కొన్నిసార్లు మృత్యువాత కూడా  పడుతున్నారు.

ఈ నేపథ్యంలో, బ్లాక్ ఫంగస్ పై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఇకపై బ్లాక్ ఫంగస్ సోకినవారికి ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. మరోపక్క, రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని, నిబంధనలు కచ్చితంగా పాటించేలా చూడాలని సీఎం స్పష్టం చేశారని వివరించారు.

గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ఫీవర్ సర్వే చేపడుతున్నామని, తద్వారా కరోనా బాధితులను గుర్తించడం సులువు అవుతుందని అన్నారు. సర్వేలో గుర్తించిన పాజిటివ్ వ్యక్తులను వారిలో లక్షణాల తీవ్రతను బట్టి ఆసుపత్రులకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో కర్ఫ్యూ విధించడం వల్ల కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
Alla Nani
Black Fungus
Arogyasri
Jagan
Andhra Pradesh
Corona Pandemic

More Telugu News