Raghu Rama Krishna Raju: అరికాళ్లు వాచిపోయేలా కొట్టారంటూ న్యాయమూర్తికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన రఘురామకృష్ణరాజు

  • నిన్న రఘురామను అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ 
  • రఘురామను సీఐడీ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
  • నాలుగు పేజీల ఫిర్యాదు సమర్పించిన రఘురామ
  • గతరాత్రి పోలీసులు తనను వేధించారన్న ఎంపీ
AP CID officials introduce Raghurama Krishna Raju before CID court

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సీఐడీ పోలీసులపై న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. తన కాళ్లకు గాయాలయ్యాయని, పోలీసులు తనను కొట్టడం వల్లే గాయపడ్డానని రఘురామకృష్ణరాజు సీఐడీ కోర్టు న్యాయమూర్తికి తెలియజేశారు. గత రాత్రి తనను వేధింపులకు గురిచేశారని, అరికాళ్లు వాచిపోయేలా కొట్టారని వివరించారు. ఈ మేరకు నాలుగు పేజీల లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు.

ఏపీ సీఐడీ అధికారులు ఈ సాయంత్రం రఘురామకృష్ణరాజును సీఐడీ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా సీఐడీ అధికారులు రిమాండ్ నివేదికను న్యాయమూర్తికి సమర్పించారు.

అటు, రఘురామకృష్ణరాజు తనకు బెయిల్ మంజూరు చేయాలని ఓ పిటిషన్, అత్యవసర వైద్యసాయం కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రఘురామకు తగిలిన గాయాలను చూసి రిమాండ్ నివేదికను పెండింగ్ లో ఉంచిన న్యాయస్థానం... ఆయనను ఆసుపత్రికి తరలించాలని ఆదేశింది.

అయితే, తాను ప్రభుత్వాసుపత్రికి వెళ్లనని రఘురామ విముఖత వ్యక్తం చేయడంతో, రమేశ్ ఆసుపత్రికి తరలించాలని న్యాయమూర్తి సూచించారు.

కాగా, తనను పోలీసులు కొట్టడంతో గాయపడ్డానని రఘురామ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయగా, ఆయనకు తగిలిన గాయాల వివరాలను కోర్టు నమోదు చేసుకుంది. రఘురామ తరఫు న్యాయవాదులు కోర్టుకు అందుకు తగిన ఆధారాలను సమర్పించారు. ఈ కేసును సీబీఐ లేదా ఎన్ఐఏకి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, ఈ వ్యవహారాన్ని లోక్ సభ స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లా దృష్టికి తీసుకెళ్లేందుకు వారు సన్నాహాలు చేస్తున్నారు.

More Telugu News