Sputnik V: రానున్న 10 నెలల్లో 250 మిలియన్ల స్పుత్నిక్‌-వి టీకాలు

  • వెల్లడించిన డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ ప్రతినిధి
  • దేశీయంగా ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత ధర మారుతుందని వెల్లడి
  • వివిధ వర్గాలకు భిన్నమైన ధరలపై చర్చించాల్సి ఉందన్న డాక్టర్‌ రెడ్డీస్‌
  • వేరియంట్లపై దీని సామర్థ్య నిర్ధారణకు జరుగుతున్న ప్రయోగాలు
In coming 10 months 250 million doses will be available in India

భారత్‌లో కరోనా మూడో టీకా స్పుత్నిక్‌-వి అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. రష్యా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ను భారత్‌లో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ ఉత్పత్తి చేసి పంపిణీ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకొంది. రానున్న 8-10 నెలల్లో మొత్తం 250 మిలియన్ల డోసుల్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని డాక్టర్‌ రెడ్డీస్‌ ఏపీఐ అండ్‌ సర్వీసెస్‌ విభాగం సీఈఓ దీపక్‌ సప్రా తెలిపారు. ప్రస్తుతం ఈ టీకా ఒక్కో డోసును జీఎస్టీతో కలుపుకొని రూ.995.40గా నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, భారత్‌లో ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత ఈ ధర మారుతుందని స్పష్టం చేశారు.

ఇక కేంద్రం, రాష్ట్రాలు, ప్రైవేట్‌ ఆసుపత్రులకు భిన్నమైన ధర నిర్ణయించాలా? అన్న అంశంపై చర్చలు జరపాల్సి ఉందని తెలిపారు. నీతి ఆయోగ్‌, ప్రభుత్వం సహా ఇతర వర్గాల నుంచి అభిప్రాయాల్ని తీసుకొని నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక ఈ వ్యాక్సిన్‌ వైరస్‌ రకాలపై ఎంత మేర ప్రభావం చూపుతుందన్న దానిపై ప్రయోగాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే యూకే వేరియంట్‌పై నిర్వహించిన ప్రయోగ ఫలితాలు వచ్చాయన్నారు. ఇక ప్రస్తుతం కొనసాగుతున్న ప్రయోగాల ఫలితాలు మే చివరికి లేదా జూన్‌ తొలి భాగంలో వస్తాయని తెలిపారు.

More Telugu News