స్థాయి సంఘాల వర్చువల్‌ సమావేశాలకు అనుమతి ఇవ్వని రాజ్యసభ ఛైర్మన్‌, లోక్‌సభ స్పీకర్‌!

14-05-2021 Fri 21:06
  • ఏడాదిగా జరగని స్థాయి సంఘాల సమావేశాలు
  • వర్చువల్ భేటీలకు అనుమతించాలని విపక్షాల విజ్ఞప్తి
  • సాంకేతిక కారణాలు, భద్రత పేరిట నిరాకరణ
  • మండిపడ్డ విపక్ష పార్టీలు
  • మోదీ వర్చువల్‌ సమావేశాలను ఉటంకిస్తూ జైరాం విసుర్లు
Vekaiah naidu om birla did not allow standing committee meetings virtually

పార్లమెంటు కమిటీల వర్చువల్‌ సమావేశాలకు అనుమతించాలని కోరుతూ విపక్షం సహా ప్రధాని మోదీ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచే కొన్ని పార్టీలు చేసిన విజ్ఞప్తిని రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తోసిపుచ్చారు. సాంకేతిక కారణాలు, భద్రతకు సంబంధించిన క్లాజులను లేవనెత్తుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు.

పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత భౌతిక సమావేశాలు నిర్వహించుకోవచ్చని సూచించారు. లేదంటే నిబంధనల్లో సవరణలు చేయాల్సి ఉంటుందని రాజ్యసభ సెక్రటేరియట్‌ వెల్లడించింది.

దీనిపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏడాది నుంచి స్థాయి సంఘాల వర్చువల్‌ సమావేశాలకు అనుమతి నిరాకరిస్తున్నారని తెలిపారు. ప్రధాని ఆయన మీటింగులు వర్చువల్‌గా నిర్వహిస్తున్నారని గుర్తుచేశారు. కానీ, 30 మంది ఎంపీలతో కూడిన స్థాయి సంఘాల సమావేశాలు మాత్రం ఏర్పాటు చేయకూడదా అని ప్రశ్నించారు. ప్రపంచంలో ఎక్కడా పార్లమెంటు తన విధి నిర్వహణ నుంచి తప్పించుకున్న దాఖలాలు లేవని వ్యాఖ్యానించారు.