Chandrababu: కుప్పం ప్రజలకు చంద్రబాబు భరోసా... కరోనాను ఎదుర్కోవడానికి రూ.1 కోటి వ్యయంతో పలు కార్యక్రమాలు!

  • కుప్పం టీడీపీ నేతలతో చంద్రబాబు వర్చువల్ సమావేశం
  • కుప్పం కరోనా పరిస్థితులపై ఆందోళన
  • సొంత నిధులు వెచ్చించేందుకు సంసిద్ధత
  • మొదట రూ.35 లక్షలతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు
Chandrababu set to spend one crore in Kuppam constituency

ఏపీలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న జిల్లాల్లో చిత్తూరు ఒకటి. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం చిత్తూరు జిల్లాలోనే ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కుప్పంలో కరోనా మహమ్మారిపై సమరశంఖం పూరించారు. కుప్పం నియోజకవర్గంలో పలు కార్యక్రమాల కోసం రూ.1 కోటి ఖర్చు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. కుప్పం టీడీపీ నేతలతో నేడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు స్థానికంగా కరోనా పరిస్థితులపై ఆందోళన వెలిబుచ్చారు. తన సొంత నిధులతో కుప్పం ప్రజలను ఆదుకుంటానని హామీ ఇచ్చారు.

మొదట కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.35 లక్షల ఖర్చుతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కొరత ఉంటే ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ద్వారా తక్షణమే నియామకాలు చేపట్టాలని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా కుప్పం నియోజకవర్గంలోని 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అవసరమైన ఔషధాలను పంపిస్తామని తెలిపారు.

ఐసోలేషన్ కు ఉపయోగపడేలా కుప్పం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 200 బెడ్లు, ఒకేషనల్ జూనియర్ కాలేజీ న్యూ బిల్డింగ్ లో 200 బెడ్లు ఏర్పాటు చేయాలని పార్టీ నేతలను ఆదేశించారు. దీనిపై చిత్తూరు జిల్లా కలెక్టర్ కు కూడా లేఖ ద్వారా వివరిస్తానని తెలిపారు.

More Telugu News