'లవ్యూ జిందగీ' యువతి కరోనాతో మృతి... జీవితం ఇంత కిరాతకమైనదా? అంటూ సోనూ సూద్ నిర్వేదం

14-05-2021 Fri 19:04
  • ఆసుపత్రి బెడ్ పైనా యువతి ధీమా
  • బాలీవుడ్ పాటతో ఉల్లాసంగా గడిపిన వైనం
  • విషాదకర రీతిలో కరోనాకు బలి
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన సోనూ సూద్
Sonu Sood says he feels so sad after woman who listen Love You Zindagi song dies of corona

కొన్నిరోజుల కిందట ఢిల్లీలో ఓ యువతి ఎమర్జెన్సీ వార్డులో కరోనా చికిత్స పొందుతూ 'లవ్యూ జిందగీ' అనే బాలీవుడ్ పాటను ఆస్వాదించడం ఓ వీడియో రూపంలో అందరినీ ఆకర్షించింది. ప్రాణాంతక కరోనాతో పోరాడుతూ కూడా ఆమె నిబ్బరంగా ఉండడం పట్ల అందరూ అచ్చెరువొందారు. ఇప్పుడా యువతి ఇక లేదన్న విషయం తెలిసి నెటిజన్లు తీవ్ర విషాదానికి గురవుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆ యువతి గురువారం కన్నుమూసింది. దీనిపై ప్రముఖ నటుడు సోనూ సూద్ స్పందించారు.

జీవితం ఇంత కిరాతకమైనదా? అంటూ ఆ 30 ఏళ్ల యువతి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. "చాలా చాలా విషాదకర ఘటన ఇది. మళ్లీ తన కుటుంబసభ్యులను చూడలేనని ఆమె ఏమాత్రం ఊహించి ఉండదు. జీవితం చాలా బాధాకరమైనదని అనిపిస్తోంది. హాయిగా బతకాల్సిన ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోతున్నారు. మళ్లీ మన జీవితం ఎలా సాధారణ స్థితికి వస్తుందన్నది పక్కనబెడితే, ఇలాంటి దుర్దశను అధిగమించడం కష్టసాధ్యమనిపిస్తోంది" అని సోనూ సూద్ ఆవేదన వ్యక్తం చేశారు.