భారత్ బయోటెక్ చిన్నారుల కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ కు డీసీజీఐ పచ్చజెండా

13-05-2021 Thu 16:49
  • ప్రస్తుతం దేశంలో 18 ఏళ్లకు పైబడినవారికే వ్యాక్సిన్
  • చిన్నారులకు వ్యాక్సిన్ పై దరఖాస్తు చేసుకున్న భారత్ బయోటెక్
  • నిపుణుల సిఫారసులకు ఆమోదం తెలిపిన డీసీజీఐ
  • 2,3వ దశ క్లినికల్ పరీక్షలకు అనుమతి
DCGI gives nod for Bharat Biotech corona vaccine for children

భారత్ బయోటెక్ కొవాగ్జిన్ పేరిట కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. అయితే చిన్నారులకు కూడా కరోనా వ్యాక్సిన్ అందించేందుకు భారత్ బయోటెక్ ఇటీవలే భారత ఔషధ నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ (డీసీజీఐ)కి దరఖాస్తు చేసుకుంది. ఈ నేపథ్యంలో భారత్ బయోటెక్ కు డీసీజీఐ ఆమోదం తెలిపింది. 2 నుంచి 18 ఏళ్ల లోపు వయసు వారిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతించింది. నిపుణుల కమిటీ సిఫారసులు మేరకు డీసీజీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

డీసీజీఐ అనుమతి నేపథ్యంలో చిన్నారుల కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి 2, 3వ దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు భారత్ బయోటెక్ సన్నద్ధమవుతోంది. అయితే, 3వ దశ క్లినికల్ ట్రయల్స్ చేపట్టాలంటే, రెండో దశ క్లినికల్ పరీక్షల డేటాను భారత్ బయోటెక్ వర్గాలు కేంద్ర ఔషధాల ప్రమాణ స్థాయి సంస్థ (సీడీఎస్ సీఓ)కు సమర్పించాల్సి ఉంటుందని డీసీజీఐ స్పష్టం చేసింది.