App: సుప్రీంకోర్టు విచారణల మీడియా కవరేజీ కోసం.. ప్రత్యేక యాప్ ను ఆవిష్కరించిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

  • దేశంలో కరోనా కల్లోలం
  • వర్చువల్ విధానంలో సుప్రీంకోర్టు విచారణలు
  • కవరేజీ ఇవ్వలేకపోతున్న మీడియా ప్రతినిధులు
  • తాజా యాప్ తో కవరేజీ ఇవ్వగలిగే సదుపాయం
Supreme Court Chief Justice NV Ramana launches app to provide access for media persons

కరోనా వ్యాప్తి నేపథ్యంలో సుప్రీంకోర్టు వర్చువల్ విధానంలో విచారణలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ విధానంలో కీలక కేసుల విచారణ కవరేజీ ఇవ్వడం పాత్రికేయులకు సాధ్యపడడంలేదు. మీడియా ప్రతినిధుల ఇబ్బందిని గుర్తించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేడు ప్రత్యేకమైన యాప్ ను ఆవిష్కరించారు.

ఈ యాప్ తో పాత్రికేయులు అనుసంధానం అవడం ద్వారా సుప్రీంకోర్టు చేపట్టే వర్చువల్ విచారణల కవరేజీ ఇవ్వవచ్చు. కీలక తీర్పులకు సంబంధించిన సంక్షిప్త సమాచారాన్ని పొందవచ్చు. జస్టిస్ ఎన్వీ రమణ చొరవతో సుప్రీంకోర్టుకు చెందిన ఈ-కమిటీ ఈ యాప్ రూపకల్పనలో కీలకపాత్ర పోషించింది. కేవలం 3 రోజుల్లోనే యాప్ ను తీసుకువచ్చింది.

కాగా, ఈ యాప్ ను విడుదల చేసిన సమయంలోనే, జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు వెబ్ సైట్ లో 'ఇండికేటివ్ నోట్స్' అనే ఫీచర్ ను కూడా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు విచారణల ప్రత్యక్ష ప్రసారానికి తాను సిద్ధమని ప్రకటించారు. సుప్రీంకోర్టు విచారణ ప్రత్యక్ష ప్రసారంపై సహ న్యాయమూర్తులతో చర్చిస్తామని తెలిపారు. ప్రత్యక్ష ప్రసారం చేసే దిశగా తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తామని చెప్పారు.

తాజా యాప్ గురించి చెబుతూ, ఇది పాత్రికేయులకు ఎంతో ఉపయుక్తమైనదని, గతంలో ఓ జర్నలిస్టుగా తాను బస్సులో తిరుగుతూ వార్తలు సేకరించిన సందర్భాలు గుర్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్టులు పడుతున్న బాధలు తనకు తెలుసని వ్యాఖ్యానించారు.

More Telugu News