'పుష్ప 1' షూటింగ్ పూర్తికావొస్తోంది!

13-05-2021 Thu 12:52
  • షూటింగు దశలో 'పుష్ప'
  • రెండు భాగాలుగా రిలీజ్ చేయాలనే నిర్ణయం
  • దసరాకి మొదటి భాగం విడుదల
  • రెండవ భాగం వచ్చే ఏడాదిలోనే    
Pushpa first part will release on Dasara

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ సరసన నాయికగా రష్మిక నటిస్తోంది. కరోనా కారణంగా ఇటీవలే ఈ సినిమా షూటింగు వాయిదా పడింది.

దాంతో ఇంతవరకూ వచ్చిన అవుట్ పుట్ .. ఇంకా చిత్రీకరించవలసిన సన్నివేశాల నిడివిని సుకుమార్ అంచనా వేసుకున్నాడట. మొత్తం నిడివి 5 గంటలకు పైగా ఉండటంతో, రెండు భాగాలుగా రిలీజ్ చేద్దామనే అభిప్రాయాన్ని నిర్మాతల దగ్గర వ్యక్తం చేశాడట. అందుకు వాళ్లతో బాటు బన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా వార్తలు వచ్చాయి.

'పుష్ప' సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలనుకుంటున్న విషయం నిజమేనని ఇటీవల నిర్మాత కూడా ధ్రువీకరించారు. అంటే ఈ సినిమా 'పుష్ప 1' .. 'పుష్ప 2' అనే రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుందన్న మాట. అలా చూసుకుంటే ఈ సినిమా ఫస్టు పార్టు షూటింగు చాలావరకూ పూర్తయినట్టేనని అంటున్నారు. మరో రెండు మూడు వారాలు కేటాయిస్తే షూటింగు పార్టు పూర్తవుతుందని చెబుతున్నారు. సెప్టెంబర్ నాటికి అన్ని పనులను పూర్తిచేసుకుని దసరాకి 'పుష్ప 1' వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక వచ్చే ఏడాదిలో 'పుష్ప 2' తీరికగా పలకరిస్తుందన్న మాట.