Israel: ఇజ్రాయెల్​ లో అల్లర్లు.. అరబ్​ లపై యూదుల దాడులు

  • ఓ వ్యక్తిని కారు నుంచి లాగి చితక్కొట్టిన వైనం
  • రాజధాని టెల్ అవీవ్ లో ఘటన
  • పావుగంటకు గానీ రాని పోలీసులు
  • సహనంగా ఉండాలన్న ప్రధాని నెతన్యాహూ
Mob Attack Arabs in Israel

బుధవారం నాటి దాడులతో ఇజ్రాయెలీలు ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. యూదులు, అరబ్ లు నివాసముండే ప్రాంతాల్లో మతఘర్షణలు జరుగుతున్నాయి. బుధవారం కొందరు యూదులు ఓ అరబ్ వ్యక్తిపై మూకుమ్మడి దాడికి దిగారు. కారులో వెళుతున్న ఆ వ్యక్తిని కిందకు లాగి నడిరోడ్డుపై పిడిగుద్దులు కురిపించారు. స్పృహ తప్పి పడిపోయేంత వరకు అతడిని కొట్టారు.

టెల్ అవీవ్ లోని బాత్ యామ్ లో జరిగిన ఆ దాడి వీడియోను ఓ టీవీ చానెల్ ప్రసారం చేసింది. దాడి జరిగిన 15 నిమిషాల తర్వాతగానీ పోలీసులు, అత్యవసర సేవల సిబ్బంది అక్కడకు చేరుకోలేదు. అయితే, దాడి చేసిన వారు మాత్రం తమ చర్యను సమర్థించుకున్నారు. యూదులపైకి ఆ వ్యక్తి కారుతో వేగంగా దూసుకొచ్చాడని ఆరోపించారు.

దాడిలో బాధితుడికి తీవ్రగాయాలయ్యాయని, ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని టెల్ అవీవ్ లోని ఇచిలోవ్ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. కాగా, టెల్ అవీవ్ లోని చాలా ప్రాంతాల్లోనూ అరబ్ లే లక్ష్యంగా యూదులు దాడులు చేశారు. దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో విధ్వంసం సృష్టించారు.

ఇజ్రాయెల్ లోని అనేక ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఉత్తరాది నగరమైన టైబీరియాస్ లో ఇజ్రాయెల్ జెండాలను పట్టుకుని ఓ కార్ పై దాడి చేస్తున్న వీడియో వైరల్ అయింది. అయితే, ముందుగా అరబ్ లే యూదులపై దాడులకు తెగబడుతున్నారని, చూస్తుంటే ‘పౌర యుద్ధం’ వచ్చేలా ఉందని లాడ్ నగర మేయర్ అన్నారు.

దేశంలో అల్లర్లు జరుగుతుండడంతో ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పందించారు. యూదులు, అరబ్ లు కొంచెం సహనం పాటించాలని కోరారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

More Telugu News