బహుముఖ ప్రజ్ఞాశాలి 'హెచ్.ఎమ్.వి' మంగపతి మృతి!

13-05-2021 Thu 12:34
  • మంగపతి జీవితంలో ఎన్నో మలుపులు
  • హెచ్.ఎమ్. రెడ్డి దగ్గర పనిచేసిన అనుభవం 
  • హెచ్.ఎమ్.వి.తో సుదీర్ఘమైన అనుబంధం
  • ఘంటసాలతో 'భగవద్గీత' పాడించినది ఆయనే
Putta Mangapathi Passed away due to Corona

కరోనా కాటుకు చాలామంది బలవుతున్నారు. సెకండ్ వేవ్ లో కరోనా కారణంగా చాలామంది ప్రముఖులు కన్నుమూశారు. ఈ క్రమంలో ప్రఖ్యాత గ్రామ్ ఫోన్ రికార్డుల  సంస్థ హెచ్.ఎమ్.వి.తో సుదీర్ఘమైన అనుబంధం ఉన్న మంగపతి కూడా కరోనా వలన మరణించారు.

కరోనాతో పోరాడి ఓడిన ఆయన మంగళవారం రాత్రి చెన్నైలో తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. స్వస్థలం తిరుపతి. హెచ్.ఎమ్.వి. సంస్థ దక్షిణాది విభాగానికి ఆయన అధిపతిగా .. ప్రధాన సలహాదారుడిగా సేవలను అందించారు. మొదటి నుంచి కూడా మంగపతికి సంగీత సాహిత్యాల పట్ల మక్కువ ఎక్కువ. గాయకుడిగా .. సంగీత దర్శకుడిగా రాణించాలని ఆయన ఎంతో తపించేవారు.

ఈ రంగంలోకి రావడానికి ముందు మంగపతి టి.టి.డి.లోను .. రైల్వే శాఖలోను పనిచేశారు. ఆ తరువాత నాటాకాలలో తనకి గల అనుభవంతో, దర్శక పితామహుడిగా ప్రసిద్ధి చెందిన హెచ్.ఎమ్. రెడ్డి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశారు. ఆయన మంచి రచయిత మాత్రమే కాదు .. గాయకుడు కూడా. 'రవి' అనే కలం పేరుతో భక్తి గీతాలను రాసి తనే స్వయంగా పాడారు.

ఇక హెచ్.ఎమ్.వి. సంస్థ ద్వారా వివిధ భాషలకు చెందిన ఎంతోమంది గాయకులను .. రచయితలను ఆయన పరిచయం చేశారు. ఘంటసాలతో 'భగవద్గీత' .. ఎమ్మెస్ సుబ్బులక్ష్మితో 'అన్నమయ్య కీర్తనలు' పాడించింది ఆయనే. "ఒకవేళ నేను వేయి సినిమాలకు దర్శకత్వం వహించినా .. నిర్మించినా, ఘంటసాలగారితో గానం చేయించిన 'భగవద్గీత'కు అవి సరితూగేవి కావు" అని మంగపతి ఒక సందర్భంలో అనడం, ఆయన ఉన్నతమైన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది.