కరోనా దరిచేరదని ఆవు పేడ పూసుకుంటే కొత్త జబ్బులు వస్తాయంటున్న డాక్టర్లు

11-05-2021 Tue 15:47
  • గుజరాత్ లో గోవుపేడ, మూత్రానికి డిమాండ్
  • శరీరానికి పూసుకుంటున్న వైనం
  • వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ప్రజల్లో నమ్మకం
  • శాస్త్రీయ ఆధారాలు లేవన్న నిపుణులు
  • జంతువుల జబ్బులు మనుషులకు వస్తాయని వెల్లడి
Doctors warns about cow dung therapy for corona

కరోనా మహమ్మారిని దేశీయ విధానాలతో అడ్డుకోవచ్చని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండడం తెలిసిందే. ముఖ్యంగా, ఆవు పేడ, మూత్రంతో కరోనా దరిచేరదని సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తుంటాయి. శరీరానికి ఆవుపేడ, మూత్రం మిశ్రమాన్ని పూసుకుంటే రోగనిరోధక శక్తి పెరిగి కరోనాను నిరోధిస్తుందని అనేకమంది భావిస్తున్నారు.

అయితే ఈ ధోరణి ప్రమాదకరమని వైద్య నిపుణులు అంటున్నారు. గోవుపేడ, గోమూత్రం కరోనాను కట్టడి చేస్తాయన్న దానికి శాస్త్రీయ ఆధారాలు లేవని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు, ఆవుపేడ, మూత్రం ద్వారా కొత్త జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

గుజరాత్ లో కొందరు సంప్రదాయవాదులు వారానికి ఒకసారి గోశాలకు వెళ్లి పేడ, మూత్రం సేకరించి ఒంటికి పూసుకుంటున్నారు. ఇది కరోనాకు విరుగుడు అని చెబుతున్నారు. గౌతమ్ మణిలాల్ అనే ఫార్మా కంపెనీ అసోసియేట్ మేనేజర్ కూడా గోశాలకు వచ్చి శరీరానికి దట్టంగా ఆవు పేడ పట్టించి ఇదే కరోనా నివారణకు దేశీయ చిట్కా అని చెబుతున్నారు. గతేడాది తాను కరోనా నుంచి కోలుకోవడానికి గోవుపేడ, గోమూత్రం సహకరించాయని వెల్లడించారు.

ఈ ధోరణిపై ప్రపంచవ్యాప్త వైద్యులు, పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఐఎంఏ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జె.ఏ.జయ్ లాల్ స్పందిస్తూ, ఇలాంటివన్నీ ఒక్కొక్కరి నమ్మకాలకు సంబంధించిన విషయాలని అన్నారు. ఆవు పేడ, మూత్రంతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందనడానికి రుజువులేవీ లేవని స్పష్టం చేశారు. ఇమ్యూనిటీ సంగతి పక్కనబెడితే... జంతువుల నుంచి కొత్త జబ్బులు మానవులకు సంక్రమించే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.