Kamal Haasan: 'ఇండియన్ 2' సమస్య పరిష్కారానికి కమల్ చొరవ!

Kamal Hassan initiates to solve problem of Indian sequel
  • పాతికేళ్ల నాటి 'ఇండియన్'కు సీక్వెల్ 
  • ఇప్పటికే కొంత చిత్రీకరణ పూర్తి
  • అభిప్రాయ భేదాలతో ఆగిన షూటింగ్
  • శంకర్ పై కోర్టుకెళ్లిన లైకా ప్రొడక్షన్స్
  • సమావేశం ఏర్పాటు చేస్తున్న కమల్     
ఒక సినిమా విషయంలో ఆ చిత్ర నిర్మాతకు, దర్శకుడికి మధ్య వివాదం తలెత్తితే దానిని సామరస్యపూర్వకంగా పరిష్కరించడంలో ఆ చిత్రం హీరో కీలక పాత్ర పోషిస్తాడు. ఇది గతంలో చాలా సందర్భాలలో జరిగింది కూడా. ఇదే కోవలో ఇప్పుడు ప్రముఖ నటుడు కమలహాసన్ కూడా 'ఇండియన్ 2' చిత్రం విషయంలో అలాంటి మధ్యవర్తి పాత్రనే పోషిస్తున్నాడు.

రెండున్నర దశాబ్దాల క్రితం వచ్చిన సంచలన చిత్రం 'ఇండియన్' (తెలుగులో భారతీయుడు)కు ఇప్పుడు ప్రముఖ దర్శకుడు శంకర్ సీక్వెల్ రూపొందిస్తున్న సంగతి విదితమే. కమలహాసన్, కాజల్ జంటగా ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్టుతో నిర్మిస్తోంది. ఇప్పటికే కొంత చిత్రీకరణ కూడా జరిగింది.

అయితే, ఆమధ్య ఈ చిత్రం షూటింగులో అగ్నిప్రమాదం జరిగి కొందరు టెక్నీషియన్లు మరణించడం.. ఆ తర్వాత కరోనా విజృంభించడంతో ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత చిత్రం బడ్జెట్టు విషయంలో దర్శకుడికి, నిర్మాతకు మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో షూటింగ్ కొనసాగించడంపై ప్రతిష్టంభన ఏర్పడింది.

దీంతో మనస్తాపం చెందిన దర్శకుడు శంకర్ ఇక ఆ చిత్రాన్ని పక్కన పెట్టి, తన తదుపరి చిత్రాన్ని రామ్ చరణ్ తో ప్రకటించేసి, ఆ ప్రాజక్టు పనులు ప్రారంభించాడు. ఇదే సమయంలో తమ చిత్రాన్ని పూర్తిచేయకుండా దర్శకుడు శంకర్ మరో చిత్రాన్ని ప్రారంభించడానికి వీల్లేదంటూ లైకా  ప్రొడక్షన్స్ అధినేత హైకోర్టుకి వెళ్లడంతో, ఇద్దరూ కూర్చుని సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని కోర్టు దర్శక నిర్మాతలకు  సూచించింది.

ఇది జరిగి కూడా కొన్నాళ్లు గడిచినప్పటికీ, సమస్య పరిష్కారం వైపు ఎవరూ ముందడుగు వేయలేదు. ఈ క్రమంలో ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు కూడా ముగిసి, రాజకీయంగా తనకు సమయం చిక్కడంతో హీరో కమల్ దీనిపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. సమస్యను పరిష్కరించి చిత్రం షూటింగును కొనసాగించే విషయంలో దర్శక నిర్మాతలతో చర్చలు జరపడానికి ఆయన చొరవ తీసుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలో త్వరలోనే వీరితో ఆయన సమావేశం కానున్నట్టు చెబుతున్నారు. దీంతో త్వరలోనే ఈ సమస్యకు శుభం కార్డు పడుతుందని భావిస్తున్నారు.
Kamal Haasan
Shankar
Indian 2
Kajal Agarwal

More Telugu News