క‌రోనా వేళ భార‌త్‌కు ట్విట్ట‌ర్ భారీ సాయం!

11-05-2021 Tue 12:29
  • దాదాపు రూ.110 కోట్ల ఆర్థిక సాయం
  • కేర్ ఎన్జీవో, ఎయిడ్‌ ఇండియా, సేవా ఇంటర్నేషనల్‌ యూఎస్‌ఏ ద్వారా సేవ‌లు
  • వైద్య ప‌రికరాలు, క‌రోనా కేంద్రాల ఏర్పాటు
twitter helps india

క‌రోనా రెండో ద‌శ విజృంభ‌ణ వ‌ల్ల ఎన్నో స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటోన్న  భార‌త్‌కు విదేశీ సంస్థ‌ల‌ నుంచి కూడా భారీగా సాయం అందుతోంది. తాజాగా, భార‌త్‌కు దాదాపు రూ.110 కోట్ల (15 మిలియన్ల డాలర్లు) ఆర్థిక సాయం అందిస్తున్న‌ట్లు ట్విట్ట‌ర్ ప్ర‌క‌టించింది.

భారత్‌కు సాయం అందించేందుకు కేర్ ఎన్జీవో, ఎయిడ్‌ ఇండియా, సేవా ఇంటర్నేషనల్‌ యూఎస్‌ఏకు 15 మిలియన్‌ డాలర్లు విరాళమిచ్చినట్లు ట్విట్ట‌ర్‌ సీఈవో జాక్‌ పాట్రిక్‌ డోర్సే  ట్వీట్ చేశారు.  కేర్‌ ఎన్జీవోకు 10 మిలియన్‌ డాలర్లు, ఎయిడ్‌ ఇండియా, సేవా ఇంటర్నేషనల్‌కు  2.5 మిలియన్‌ డాలర్ల చొప్పున విరాళమిచ్చిన‌ట్లు తెలిపారు.

తాము అందించిన ఈ నిధుల ద్వారా సేవా ఇంటర్నేషనల్‌ ఎన్జీవో క‌రోనా రోగుల  ప్రాణాలు కాపాడే ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, వెంటిలేటర్లు వంటి వైద్య పరికరాలను కొనుగోలు చేస్తుందని తెలిపారు. అనంత‌రం వాటిని భారత్‌లోని ప్రభుత్వ ఆసుపత్రులు, క‌రోనా చికిత్స‌ కేంద్రాలకు పంపిణీ చేస్తారని వివ‌రించారు.  

కేర్‌ ఎన్జీవో ద్వారా తాత్కాలిక కొవిడ్‌ కేర్‌ సెంటర్ల ఏర్పాటు కోసం భార‌త‌ ప్రభుత్వానికి సహకారం అందుతుంద‌ని తెలిపారు. అలాగే, ఆసుప‌త్రుల‌కు ఆక్సిజన్, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు పీపీఈ కిట్లు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు వ్యాక్సిన్‌ వేయించుకునేలా కృషి చేయ‌డం వంటి సాయం అందుతుంద‌ని చెప్పారు.

ఎయిడ్‌ ఇండియా సంస్థ ద్వారా కొవిడ్ బాధితులను ఆసుపత్రుల్లో చేర్చడంతో పాటు వారి చికిత్సలకు అయ్యే ఖర్చులు భరించడం, క‌రోనా ఆంక్ష‌ల‌ వల్ల ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను ఆదుకోవడం వంటి సహాయ కార్య‌క్ర‌మాలు అందుతాయ‌ని వివ‌రించారు.