ruia hospital: తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్‌ అందక 11 మంది మృతి

  • ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయం
  • ఊపిరాడక అల్లాడిన కరోనా బాధితులు
  • ట్యాంకర్‌ రాకలో ఐదు నిమిషాల ఆలస్యం 
  • ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన హోంమంత్రి సుచరిత
Oxygen shortage at ruia hospital 11 dead

తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో 11 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ్‌ వెల్లడించారు. చెన్నై నుంచి రావాల్సిన ట్యాంకర్‌ ఐదు నిమిషాలు ఆలస్యం కావడంతో ఈ ఘోరం జరిగినట్లు తెలిపారు.

వెంటిలేటర్‌పై ఉన్న బాధితులు మాత్రమే చనిపోయారని, మిగతా వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని కలెక్టర్‌ తెలిపారు. వారి పరిస్థితిని డాక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆక్సిజన్ సరఫరా నిలిచిపోగానే ఆసుపత్రిలో తొలుత ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అప్రమత్తమైన వైద్యులు సీపీఆర్‌ విధానంలో శ్వాస అందించారు. బాధితుల బంధువులు పక్కనే ఉండి అట్టముక్కలతో గాలిని విసిరారు. ఆక్సిజన్ ట్యాంకర్‌ రాగానే సాంకేతిక నిపుణులు వెంటనే స్పందించి సరఫరాను పునరుద్ధరించారు.

మరోవైపు ఈ ఘటనపై హోంమంత్రి సుచరిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. విషయం తెలుసుకున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఆక్సిజన్‌ అందక 11 మంది చనిపోయిన ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. అలాగే, తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సైతం ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

More Telugu News