మాల్దీవుల్లో ఓ బార్లో డేవిడ్ వార్నర్, మైకేల్ స్లేటర్ డిష్యుం డిష్యుం!

09-05-2021 Sun 17:30
  • కరోనా వ్యాప్తితో మధ్యలోనే నిలిచిన ఐపీఎల్
  • స్వదేశానికి విమానాల్లేకపోవడంతో మాల్దీవులకు వెళ్లిన ఆసీస్
  • వార్నర్, స్లేటర్ కొట్టుకున్నారంటూ మీడియాలో కథనాలు
  • ఖండించిన వార్నర్, స్లేటర్
Reports says David Warner and Michael Slater involved into a brawl

కరోనా వ్యాప్తి కారణంగా ఐపీఎల్ అర్ధంతరంగా ఆగిపోవడంతో ఆస్ట్రేలియా క్రికెటర్లు, వ్యాఖ్యాతలుగా పనిచేస్తున్న మాజీ ఆటగాళ్లు మాల్దీవులు చేరుకున్న సంగతి తెలిసిందే. మే 15 వరకు ఆస్ట్రేలియాకు వెళ్లే విమాన సర్వీసులు నిలిపివేసిన నేపథ్యంలో, ఆస్ట్రేలియన్లు మాల్దీవుల్లో వేచి చూస్తున్నారు. అయితే, ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్, మాజీ ఆటగాడు, క్రికెట్ కామెంటేటర్ మైకేల్ స్లేటర్ మాల్దీవుల్లోని ఓ బార్లో బాహాబాహీకి దిగినట్టు కథనాలు వచ్చాయి. మద్యం మత్తులో కలబడ్డారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

అయితే ఈ కథనాలను డేవిడ్ వార్నర్, మైకేల్ స్లేటర్ ఖండించారు. అవన్నీ పుకార్లేనని మైకేల్ స్లేటర్ స్పష్టం చేశాడు. వార్నర్, తాను మంచి స్నేహితులం అని, తమ మధ్య గొడవ జరిగేందుకు ఎలాంటి అవకాశం లేదని స్పష్టం చేశాడు.

అటు వార్నర్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక్కడ ఎలాంటి అసాధారణ ఘటన జరగలేదని వెల్లడించాడు. ఇలాంటివన్నీ ఎక్కడ పుట్టుకొస్తాయో అర్థం కావడంలేదని, ప్రత్యక్షంగా చూడకుండా, నిర్దిష్ట ఆధారాలు లేకుండా గాలి వార్తలను కథనాలుగా మార్చడం తగదని వార్నర్ హితవు పలికాడు.