కరోనా ఎఫెక్ట్... లైగర్ టీజర్ విడుదల వాయిదా

09-05-2021 Sun 14:14
  • పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్
  • విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా చిత్రం
  • నేడు విజయ్ దేవరకొండ పుట్టినరోజు
  • టీజర్ నేడు విడుదల చేయాలని భావించిన యూనిట్
  • దేశంలో కరోనా కల్లోలం
  • సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాకే టీజర్ విడుదల
Liger teaser release postponed due to corona pandemic

విజయ్ దేవరకొండ ఓ ఫైటర్ పాత్రలో నటిస్తున్న చిత్రం లైగర్. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకుడు. ఇందులో అనన్య పాండే కథానాయిక. ఈ సినిమా టీజర్ ను నేడు విజయ్ దేవరకొండ పుట్టినరోజు (మే 9) సందర్భంగా  విడుదల చేయాలని సంకల్పించారు. కానీ కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉండడంతో లైగర్ టీజర్ విడుదలను వాయిదా వేస్తున్నట్టు చిత్రబృందం ఓ ప్రకటనలో తెలిపింది.

ప్రస్తుతం దేశం కొవిడ్ కబంధ హస్తాల్లో చిక్కి విలవిల్లాడుతున్న స్థితిలో టీజర్ ను విడుదల చేయలేకపోతున్నామని, పరిస్థితులు కుదుటపడి ప్రశాంత వాతావరణం ఏర్పడేంత వరకు లైగర్ టీజర్ విడుదలను వాయిదా వేస్తున్నామని వెల్లడించింది. అయితే, ఈ సినిమాలో విజయ్ దేవరకొండ గతంలో ఎన్నడూ కనిపించనంత విభిన్నంగా దర్శనమిస్తాడని హామీ ఇస్తున్నామని, ఎవరినీ నిరాశకు గురిచేయని రీతిలో సరికొత్తగా కనిపిస్తాడని ఆ ప్రకటనలో వివరించింది.