సెంట్రల్ విస్టా ప్రాజెక్టు కొత్తది కానప్పటికీ కాంగ్రెస్ తన కపటబుద్ధిని ప్రదర్శిస్తోంది: కేంద్రమంత్రి హర్దీప్ సింగ్

08-05-2021 Sat 16:13
  • కాంగ్రెస్ పార్టీపై కేంద్రమంత్రి ధ్వజం
  • కాంగ్రెస్ మాటతీరు వింతగా ఉందని విమర్శలు
  • సెంట్రల్ విస్టా ప్రాజెక్టు వ్యయం రూ.20 వేల కోట్లు అని వెల్లడి
  • అంతకు రెట్టింపు మొత్తం కరోనా వ్యాక్సిన్ కు కేటాయించినట్టు వివరణ
Union minister Hardeep Singh Puri condemns Congress party statements on Central Vista Project

కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై కాంగ్రెస్ మాటతీరు చాలా వింతగా ఉందని విమర్శించారు. కొన్ని సంవత్సరాలుగా సెంట్రల్ విస్టా ప్రాజెక్టు వ్యయం రూ.20 వేల కోట్లు అని, ఒక్క సంవత్సరంలోనే అందుకు రెట్టింపు మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ కోసం కేటాయించిందని తెలిపారు. ఏ అంశానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో తమకు తెలుసని స్పష్టం చేశారు.

సెంట్రల్ విస్టా ప్రాజెక్టు కొత్తది కానప్పటికీ కాంగ్రెస్ పార్టీ తన కపటబుద్ధిని ప్రదర్శిస్తోందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మహారాష్ట్రలో ఎమ్మెల్యేలకు కొత్త ఇళ్లను, ఛత్తీస్ గఢ్ లో కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించుకోవడంలో తప్పు లేనప్పుడు, సెంట్రల్ విస్టా ప్రాజెక్టును ఎందుకు తప్పుబడుతున్నారని హర్దీప్ సింగ్ నిలదీశారు.

కాంగ్రెస్ పార్టీది రెండు నాలుకల ధోరణి అని విమర్శించారు. యూపీఏ హయాంలో కొత్త పార్లమెంటు భవనం కోసం కాంగ్రెస్ నాయకులు లేఖ రాశారని, 2012లో స్పీకర్ ఇదే అంశంపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు లేఖ రాశారని వెల్లడించారు. ఇప్పుడు జరుగుతున్న ఇదే ప్రాజెక్టును వ్యతిరేకించే అర్హత కాంగ్రెస్ వారికి ఉందా? అని ప్రశ్నించారు.