Alla Nani: పేషెంట్లు కోవిడ్ సెంటర్లకు వెళ్లకుండా ఆసుపత్రులకు వెళ్లడానికి కారణం ఇదే: ఆళ్ల నాని

Patients are going to hospitals due to lack of oxygen says Alla Nani
  • చిత్తూరు జిల్లాలో కరోనా తీవ్రతపై సమీక్ష నిర్వహించాం
  • రుయా, స్విమ్స్ ఆసుపత్రుల్లో సమస్యలు లేకుండా చేస్తాం
  • రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగుతోంది
కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకుంటోందని ఏపీ ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని తెలిపారు. చిత్తూరు జిల్లాలో కరోనా తీవ్రతపై సమీక్షను నిర్వహించామని చెప్పారు. తిరుపతిలోని రుయా, స్విమ్స్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్, బెడ్లు, రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ల లభ్యతపై చర్చించామని తెలిపారు.

రాష్ట్రానికి 500 టన్నుల ఆక్సిజన్ మాత్రమే వస్తోందని... ఇందులో చిత్తూరు జిల్లాకి 40 టన్నుల ఆక్సిజన్ ను పంపుతున్నామని చెప్పారు. ఈ రెండు ఆసుపత్రుల్లో సమస్యలు లేకుండా చేస్తామని తెలిపారు.

కరోనా సెంటర్ల సంఖ్యను పెంచితే సమస్య తగ్గుతుందని... ఈ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆళ్ల నాని చెప్పారు. అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లోని బెడ్లను ఆరోగ్యశ్రీ కింద తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగుతోందని... కేంద్రం పంపుతున్న వ్యాక్సిన్లను ఎప్పటికప్పుడు వేస్తున్నామని చెప్పారు. ఆక్సిజన్ కొరత వల్లే కరోనా పేషెంట్లు కోవిడ్ సెంటర్లకు వెళ్లకుండా ఆసుపత్రులకు వస్తున్నారని అన్నారు. కోవిడ్ సెంటర్లకు ఆక్సిజన్ కొరత లేకుండా చేసి, ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గిస్తామని చెప్పారు.
Alla Nani
YSRCP
Corona Virus

More Telugu News