ఈ నలుగురికి కరోనా కంటే భయంకరమైన లక్షణాలు ఉన్నాయి: కొడాలి నాని

08-05-2021 Sat 15:07
  • కరోనా కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం
  • జూమ్ లో చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారు
  • కరోనా పెరగడానికి చంద్రబాబు, ఎల్లో మీడియానే కారణం
These four persons have most dangerous symptoms than Kodali Nani

కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం పటిష్టమైన చర్యలను తీసుకుంటోందని మంత్రి కొడాలి నాని తెలిపారు. రాష్ట్రంలో ఒకే రోజు 6 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ వేశామని... మరిన్ని వ్యాక్సిన్లను పంపాలని ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాశారని చెప్పారు. చంద్రబాబు, రామోజీరావు, టీవీ5 నాయుడు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలకు ఇవేమీ కనిపించడం లేదని మండిపడ్డారు. అసత్య ప్రచారాలు చేయడమే వీరి లక్ష్యమని చెప్పారు. ఈ నలుగురికి కరోనా కంటే భయంకరమైన లక్షణాలు ఉన్నాయని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వంపై జూమ్ యాప్ లో చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు. రోజుకు 10 లక్షల వ్యాక్సిన్లు వేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని... వ్యాక్సిన్ల కోసం రూ. 1,600 కోట్లను ఎక్కడికి పంపించాలో చెప్పాలని ప్రశ్నించారు. కర్నూలులో కొత్త రకం కరోనా వైరస్ బయటపడిందంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు సీబీఎన్420 అనే వైరస్ నారావారిపల్లెలో పుట్టిందని అన్నారు.

రాష్ట్రంలో కరోనా పెరగడానికి చంద్రబాబు, ఎల్లో మీడియానే కారణమని కొడాలి నాని విమర్శించారు. ఎన్నికలు పెట్టించి వైరస్ వ్యాప్తికి కారణమయ్యారని అన్నారు. తప్పుడు ప్రచారం చేసే వారిని జైల్లో పెట్టాలని వ్యాఖ్యానించారు.