పెళ్లి కూడా చేసుకోకుండా హాకీకే తన జీవితాన్ని అంకితం చేసిన లెజెండ్ కరోనాతో కన్నుమూత

08-05-2021 Sat 14:33
  • ఇటీవల కరోనా బారినపడిన రవీందర్ పాల్ సింగ్
  • గురువారం కొవిడ్ నెగెటివ్
  • జనరల్ వార్డుకు మార్చిన వైనం
  • ఒక్కసారిగా క్షీణించిన ఆరోగ్యం
  • ఈ ఉదయం కన్నుమూత
Indian hockey legend Ravinder Pal Singh dies of post corona problems

కరోనా రక్కసి భారత హాకీ వర్గాల్లోనూ తీవ్ర విషాదం నింపింది. భారత హాకీ దిగ్గజాల్లో ఒకరిగా భావించే రవీందర్ పాల్ సింగ్ ను కరోనా వైరస్ కబళించింది. 65 ఏళ్ల రవీందర్ పాల్ సింగ్ కొవిడ్ నుంచి కోలుకున్నా, అప్పటికే ఆ మహమ్మారి ఆయన ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలిగించింది.

కరోనా బారినపడిన సింగ్ ను కుటుంబ సభ్యులు ఏప్రిల్ 24న లక్నోలోని వివేకానంద ఆసుపత్రికి తరలించారు. రెండు వారాల పాటు పోరాడిన అనంతరం ఆయనకు గురువారం కరోనా నెగెటివ్ వచ్చింది. దాంతో సాధారణ వార్డుకు మార్చారు. కానీ, రవీందర్ పాల్ సింగ్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. ఆయనకు వైద్యులు వెంటిలేటర్ అమర్చారు. నిరంతరం ఆక్సిజన్ అందేలా ఏర్పాట్లు చేశారు. అయితే వారి ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఈ ఉదయం కన్నుమూశారు.

హాకీ క్రీడను ప్రాణప్రదంగా ప్రేమించే రవీందర్ పాల్ సింగ్ పెళ్లి కూడా చేసుకోలేదు. తన మేనకోడలు ప్రగ్యా యాదవ్ వద్ద ఉంటున్నారు. ఎప్పుడూ ఆట కోసం తపించే ఆయన 1980 మాస్కో ఒలింపిక్స్ లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఆ ఈవెంట్ లో భారత జట్టు పసిడి పతకం గెలుచుకుంది. ఆ తర్వాత రవీందర్ పాల్ సింగ్ 1984లో లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ లోనూ ఆడారు.

అంతకుముందు 1979లో జూనియర్ వరల్డ్ కప్ ఆడిన సింగ్... 1980, 83లో పాకిస్థాన్ లోని కరాచీలో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలోనూ, హాంకాంగ్ లో జరిగిన 10 దేశాల సిల్వర్ జూబ్లీ టోర్నీలోనూ, 1982లో ముంబయిలో జరిగిన హాకీ వరల్డ్ కప్ లోనూ దేశానికి ప్రాతినిధ్యం వహించారు. రవీందర్ పాల్ సింగ్ మృతి పట్ల కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం భారత హాకీకి తీరని లోటు అని, ఆయన అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు.