10 రోజులుగా ఎంతో కష్ట కాలాన్ని ఎదుర్కొంటున్నాం: శిల్పాశెట్టి

07-05-2021 Fri 17:47
  • మా కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది
  • ఇంట్లో ఉన్న గదుల్లో అందరూ ఐసొలేట్ అయ్యారు
  • దేవుడి దయవల్ల అందరూ కోలుకుంటున్నారు
Shilpa Shetty family affected with Corona Virus

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి బాధాకర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఆమె కుటుంబం మొత్తం కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె ఈరోజు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. గత 10 రోజులుగా తాము ఎంతో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నామని తెలిపారు.

తొలుత తన అత్త, మామలకు కరోనా నిర్ధారణ అయిందని... ఆ తర్వాత పిల్లలు షమిష, వియాన్ రాజ్, మా అమ్మ, చివరగా తన భర్త రాజ్ కుంద్రా కరోనా బారిన పడ్డారని చెప్పారు. అందరూ కూడా ఇంట్లోని గదుల్లో ఐసొలేట్ అయ్యారని... డాక్టర్ల సూచన మేరకు చికిత్స పొందుతున్నారని తెలిపారు.

తమ ఇంట్లో పని చేస్తున్న ఇద్దరికి కూడా కూడా కరోనా సోకిందని శిల్పా చెప్పారు. కోవిడ్ సెంటర్లో వారు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని తెలిపారు. దేవుడి దయ వల్ల అందరూ కోలుకుంటున్నారని చెప్పారు. తనకు నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని తెలిపారు. తగిన సమయంలో సాయం చేసిన ముంబై కార్పొరేషన్ అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. అందరి ప్రేమాభిమానాలకు థ్యాంక్స్ చెపుతున్నానని అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, సురక్షితంగా ఉండాలని తెలిపారు.