Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు మాటలు నిజమని నమ్మి ఇతర రాష్ట్రాలు తెలుగు ప్రజలకు క్వారంటైన్ విధిస్తున్నాయి: సజ్జల 

Sajjala slams Chandrababu on alleged covid new variant
  • చంద్రబాబుపై ధ్వజమెత్తిన సజ్జల
  • ఎన్440కే అంటూ ప్రజలను భ్రమింపచేస్తున్నాడని విమర్శలు
  • సీఎం జగన్ పై రాజకీయంగా కక్షగట్టాడని ఆరోపణ
  • చంద్రబాబుపై పౌరసమాజం ఓ నిర్ణయం తీసుకోవాలన్న సజ్జల
ఏపీలో అత్యంత ప్రమాదకరమైన ఎన్440కే కరోనా వేరియంట్ వ్యాపిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గత కొన్నిరోజులుగా చెబుతున్నాడని, ఇందులో ఎంతమాత్రం నిజంలేదని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఎన్440కే స్ట్రెయిన్ అనేది చంద్రబాబు ఊహల్లోంచి పుట్టుకొచ్చిందేనని అన్నారు.

చంద్రబాబు నైజం గురించి తెలిసిన తాము, కొత్త వైరస్ అంటూ ప్రచారం చేయడంపై తొలిరోజే ఆందోళన చెందామని, ఈ ప్రచారం ఎంతవరకు వెళుతుందోనని భయపడ్డామని తెలిపారు. సీఎం జగన్ పై రాజకీయంగా కక్షగట్టిన చంద్రబాబు ఈ విధంగా లేని వైరస్ ను ఉన్నట్టు భ్రమింప చేస్తున్నాడని, తన అనుకూల మీడియా సాయంతో విషప్రచారం చేస్తున్నారని విమర్శించారు. చివరికి ఆ లేని స్ట్రెయిన్ కు ఏపీ స్ట్రెయిన్ అని పేరుపెట్టే స్థాయికి పరిస్థితి వచ్చిందని విచారం వ్యక్తం చేశారు.

చంద్రబాబు చెబుతున్న మాటలు నిజమని నమ్మి ఒడిశా, ఢిల్లీ ప్రభుత్వాలు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే వారికి రెండు వారాల పాటు క్వారంటైన్ విధించేలా ఆదేశాలు ఇస్తున్నాయని వెల్లడించారు. చంద్రబాబు గతంలో 14 ఏళ్లు సీఎంగా పనిచేయడం, వృద్ధనేత కావడంతో ఇతర రాష్ట్రాల నేతలు ఆయన మాటలు నమ్ముతున్నారని, ఇది ఎంతో దురదృష్టకరమైన విషయం అని సజ్జల పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఎవరైనా అరకొర జ్ఞానంతో ఇలాంటి ప్రచారం చేస్తే దండించాల్సిన చంద్రబాబు... తానే చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నాడని, ఆయనను ఏంచేయాలో మేధావులు, పౌర సమాజం ఆలోచించాలని అన్నారు.
Sajjala Ramakrishna Reddy
Chandrababu
N440K
Corona New Strain
Andhra Pradesh

More Telugu News