కరోనా కాటు: మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి ఇంట్లో వరుస విషాదాలు

07-05-2021 Fri 06:58
  • గత నెల 23న వేద తల్లి కన్నుమూత
  • అదే రోజు వెంటిలేటర్‌పై సోదరి
  • తన ప్రపంచం కుదుపులకు గురైందన్న వేద
Team India Cricketer Veda Krishnamurthy loses her sister to COVID 

దేశంలో విలయం సృష్టిస్తున్న కరోనా మహమ్మారి టీమిండియా మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి కుటుంబంలో వరుస విషాదాలు నింపింది.14 రోజుల వ్యవధిలో వేద తల్లి, అక్క కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారినపడిన వేద అక్కయ్య (45) వాత్సల శివకుమార్ కర్ణాటక, చిక్‌మగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మొన్న మృతి చెందారు. కాగా, గత నెల 23న వేద తల్లి కూడా కరోనా కారణంగానే ప్రాణాలు కోల్పోయారు.

తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న వాత్సలకు అదే రోజు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. తొలుత కొంత కోలుకున్నట్టే కనిపించిన ఆమె పరిస్థితి విషమించడంతో మొన్న మృతి చెందారు. కాగా, కరోనా బారినపడిన వేద తండ్రి, సోదరుడు, రెండో అక్కతోపాటు కుటుంబంలో మరికొందరు కోలుకున్నారు. తన కుటుంబం, తన ప్రపంచం ఒక్కసారిగా కుదుపునకు గురైందని వేద ఆవేదన వ్యక్తం చేసింది. అక్కకు వీడ్కోలు చెప్పాల్సి రావడంతో ఎంతో బాధగా ఉందని పేర్కొంది.