G Anand: కరోనాతో కన్నుమూసిన టాలీవుడ్ సీనియర్ గాయకుడు ఆనంద్

Veteran Telugu Singer G Anand Passes Away
  • 1970లలో తన గాత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఆనంద్
  • ఘంటసాల మరణం తర్వాత పలువురు నటులకు గాత్రదానం
  • స్వస్థలం శ్రీకాకుళం జిల్లాలోని తులగాం
తెలుగు సినీ పరిశ్రమ మరో ప్రముఖుడిని కోల్పోయింది. సీనియర్ గాయకుడు జి.ఆనంద్ గత రాత్రి హైదరాబాదులో కరోనాతో కన్నుమూశారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. ఇటీవల కరోనా బారినపడిన  ఆయన ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించింది. ఆక్సిజన్ స్థాయులు 55కు పడిపోయాయి. దీంతో ఆయనను వెంటనే బీఎన్‌రెడ్డి నగర్ సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు ఆక్సిజన్ అందించి చికిత్స చేసినా ఫలితం లేకపోయింది.

ఆనంద్ స్వస్థలం శ్రీకాకుళం జిల్లాలోని తులగాం. తన గాత్రంతో 70లలో తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఆయనకు ఎంతగానో పేరుతెచ్చిన ‘ఒక వేణువు వినిపించెను’, ‘దిక్కులు చూడకు రామయ్య’, ‘విఠలా విఠలా పాండురంగ విఠలా’ వంటి అనేక పాటలు ఇప్పటికీ మార్మోగుతూనే ఉన్నాయి. ఘంటసాల మరణం తర్వాత పలువురు హీరోలకు గాత్రాన్ని అందించారు. కాగా, ‘స్వరమాధురి’ పేరుతో ఓ సంస్థను స్థాపించిన ఆనంద్ వేలాది కచేరీలు నిర్వహించారు. ఆనంద్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
G Anand
Tollywood
Corona Virus
Hyderabad

More Telugu News