ఏపీలో ఉదయం 6 గంటలకే తెరచుకోనున్న మద్యం దుకాణాలు!

05-05-2021 Wed 08:39
  • నేటి నుంచి అమలుకానున్న కర్ఫ్యూ
  • మధ్యాహ్నం 12 గంటల తరువాత అన్ని దుకాణాలూ బంద్
  • మద్యం డిపోలకు కూడా నిబంధనల వర్తింపు
Liquor Shops Open by 8 AM in AP

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి కర్ఫ్యూ అమలు కానుండటంతో, ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మద్యం దుకాణాలు తెరచి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా కట్టడి నిమిత్తం నేటి నుంచి మధ్యాహ్నం 12 గంటల తరువాత ఏపీ వ్యాప్తంగా కర్ఫ్యూను విధించిన సంగతి తెలిసిందే. అంటే, అన్ని రకాల దుకాణాలను మధ్యాహ్నానికి మూసివేయాలి.

గతంలో మద్యం దుకాణాలు ఉదయం 11 గంటలకు తెరచి, రాత్రి 9 గంటలకు మూసేస్తుండేవారు. ఇప్పుడు పరిస్థితి మారగా, మద్యం దుకాణాల వద్ద రద్దీని నియంత్రించేందుకు ఉదయం నుంచే షాపులను తెరవాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించి, ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మద్యం సరఫరాలు చేసే డిపోలు కూడా ఇవే నిబంధనలను పాటించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.