ఈ నెల 13న రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నాం: మంత్రి పేర్ని నాని

04-05-2021 Tue 16:59
  • ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ
  • పేర్ని నాని మీడియా సమావేశం
  • ఈ నెల 13న రైతు భరోసా నిధుల విడుదల
  • రైతులకు రూ.4,050 కోట్ల నిధులు
  • 54 లక్షల మంది రైతులకు లబ్ది
Perni Nani gives details of cabinet decisions

ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 13న రాష్ట్రలో మరో విడత రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నామని వెల్లడించారు. మొత్తం రూ.4,050 కోట్ల నిధులను విడుదల చేస్తున్నట్టు తెలిపారు.

2019-20 సంవత్సరానికి 46,69,000 మంది రైతు భరోసా పథకానికి అర్హులయ్యారని, 2020-21వ సంవత్సరంలో 51,59,000 మంది రైతులు అర్హులయ్యారని పేర్ని నాని వివరించారు. 2021-22 సంవత్సరానికి గాను సుమారు 54 లక్షల మంది లబ్దిదారులయ్యారని తెలిపారు. వీరికి మే 13న రైతు భరోసా ప్రయోజనం అందుతుందని అన్నారు.

2020 ఖరీఫ్ లో పంటనష్టం చవిచూసిన రైతులకు వైఎస్సార్ ఉచిత పంట బీమా పథకం ద్వారా మే 25న రూ.2,589 కోట్లు చెల్లించనున్నట్టు తెలిపారు. 38,30,000 మంది రైతుల ఖాతాల్లో బీమా మొత్తం జమ చేస్తామని చెప్పారు. ఇక, సముద్రంలో వేటపై నిషేధం ఉన్నందున ప్రతి మత్స్యకార కుటుంబానికి మే 18న రూ.10 వేలు సాయం చెల్లించనున్నట్టు వివరించారు. దీని ద్వారా 1,30,469 మంది లబ్దిపొందుతారని పేర్ని నాని వెల్లడించారు.