Assam: జైలు నుంచే గెలుపొందిన అఖిల్ గొగోయి.. అరుదైన ఘనత

  • జైలులో ఉండడంతో ప్రచారం కూడా చేయలేకపోయిన అఖిల్ గొగోయి
  • బీజేపీ అభ్యర్థిపై 11,875 ఓట్లతో గెలుపు
  • జార్జిఫెర్నాండెజ్ తర్వాత జైలు నుంచి గెలిచిన తొలి వ్యక్తిగా రికార్డు
Jailed Assam Activist Akhil Gogoi creates record

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా ఉద్యమం చేసి జైలుపాలైన అస్సాంకు చెందిన అఖిల్ గొగోయి రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. అస్సాం శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. గొగోయి గెలవడంలో ఎలాంటి విశేషం లేదు కానీ.. జైలులో ఉండడంతో ప్రచారం కూడా చేయలేకపోయిన ఆయన శివసాగర్‌లో బీజేపీకి చెందిన తన సమీప ప్రత్యర్థి సురభి రాజ్‌కోన్‌వారిపై 11,875 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించడమే విశేషం.

కుమారుడు జైలులో ఉండడంతో ప్రచార బాధ్యతలను గొగోయి తల్లి 85 ఏళ్ల ప్రియాదా గొగోయి నెత్తికెత్తుకున్నారు. ఆ వయసులోనూ ఆమె రోడ్లపైకి వచ్చి తన కుమారుడిని గెలిపించాలని కోరారు. ఆమె పట్టుదలకు, ప్రచారానికి అసోం వాసులు దాసోహమయ్యారు. మరోవైపు సామాజిక హక్కుల కార్యకర్త మేధాపాట్కర్, సందీప్ పాండే కూడా ఆమెతో కలిసి ప్రచారం చేశారు. గొగోయి పార్టీ రైజోర్ దళ్ తరపున వందలాదిమంది యువతీయువకులు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు.

మరోవైపు, ఈ నియోజక వర్గాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ విజయమే లక్ష్యంగా ప్రచారం చేసినప్పటికీ ఫలితం లభించలేదు. కాగా, జార్జిఫెర్నాండెజ్ 1977లో జైలు నుంచే లోక్‌సభకు పోటీ చేసి 3 లక్షలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. ఆ తర్వాత రాజకీయ ఖైదీగా ఉంటూ విజయం సాధించినది గొగోయి ఒక్కరే.

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అస్సాం వ్యాప్తంగా జరిగిన హింసాత్మక నిరసనల్లో గొగోయి పాత్ర ఉందని ఆరోపిస్తూ 2019లో డిసెంబరులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్ట్ చేసి దేశద్రోహం అభియోగాలు నమోదు చేసింది. దీంతో గొగోయి సొంతంగా రైజోర్ దళ్ పార్టీని ఏర్పాటు చేసుకుని రంగంలోకి దిగారు.

More Telugu News