Bill Gates: 27 ఏళ్ల వైవాహిక బంధానికి బిల్‌గేట్స్ దంపతుల చెక్.. విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటన

Bill And Melinda Gates Announce Divorce After 27 Years Of Marriage
  • ప్రపంచాన్ని నివ్వెరపరిచిన నిర్ణయం
  • తమ నిర్ణయాన్ని గౌరవించాలంటూ ట్వీట్
  • బిల్‌మెలిందా గేట్స్ ఫౌండేషన్ కొనసాగుతుందని స్పష్టీకరణ
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ దంపతులు గత రాత్రి చేసిన ట్వీట్ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. తాను, మెలిందా ఇద్దరం విడాకులు తీసుకోబోతున్నట్టు అందులో పేర్కొన్నారు. పలుమార్లు ఆలోచించి, ఎంతో మథనం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.

తమ 27 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నామని, ఈ కాలంలో ముగ్గురు అత్యద్భుతమైన పిల్లలను తీర్చిదిద్దామని పేర్కొన్నారు. తాము విడిపోయినప్పటికీ బిల్‌మెలిందా గేట్స్ ఫౌండేషన్ ఎప్పటికీ కొనసాగుతుందని, ప్రపంచంలోని ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా, నిర్మాణాత్మకంగా ఎదిగేలా తమ ఫౌండేషన్ కృషి చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. అయితే, భార్యాభర్తలుగా ఇక కొనసాగలేమని భావించిన తాము కొత్త ప్రపంచంలోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నామని, తమ నిర్ణయాన్ని, వ్యక్తిగత ఆకాంక్షలను గౌరవిస్తారని ఆశిస్తున్నట్టు గేట్స్, మెలిందాలు పేర్కొన్నారు.

బిల్‌గేట్స్, మెలిందాలు 1994లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం బిల్ గేట్స్ వయసు 65 సంవత్సరాలు. మెలిందా వయసు 56 సంవత్సరాలు. మైక్రోసాఫ్ట్‌‌లో మెలిందా ప్రొడక్షన్ మేనేజర్‌గా ఉన్నారు. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరైన బిల్‌గేట్స్ ఆస్తి ఫిబ్రవరి నాటికి 137 బిలియన్ డాలర్లు. మెలిందాను వివాహం చేసుకున్న తర్వాత 2000వ సంవత్సరంలో బిల్‌మెలిందా గేట్స్ ఫౌండేషన్‌ను స్థాపించారు. ఇప్పటి వరకు ఈ సంస్థ ద్వారా 53 మిలియన్ డాలర్లను ధార్మిక కార్యక్రమాల కోసం వెచ్చించారు.
Bill Gates
Melinda Gates
Divorce

More Telugu News